స్వతంత్ర అభ్యర్థికి మరో పార్టీ గుర్తా..? | Sakshi
Sakshi News home page

స్వతంత్ర అభ్యర్థికి మరో పార్టీ గుర్తా..?

Published Fri, Mar 29 2019 12:08 PM

Maddisetty Venugopal Fires On RO Krishnaveni For Election Symbol Issue - Sakshi

సాక్షి, దర్శి: నిబంధనలకు విరుద్ధంగా ప్రజాశాంతి పార్టీ గుర్తు అయిన హెలికాప్టర్‌ను ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఎలా ఇస్తారని దర్శి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆర్‌ఓ కృష్ణవేణిని నిలదీశారు. స్థానిక ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్‌కు హెలికాఫ్టర్‌ గుర్తును ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మద్దిశెట్టి కలుగజేసుకుని ఆ గుర్తు ప్రజాశాంతి పార్టీకి చెందినదని ఆపార్టీ ఆభ్యర్థి నామినేషన్‌ చెల్లలేదని చెప్పారు. ఆ గుర్తును మరలా స్వతంత్య్ర అభ్యర్థికి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

దీంతో ఆర్‌ఓ కృష్ణవేణి మాట్లాడుతూ గురువారం స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్‌ హెలికాఫ్టర్‌ గుర్తును కావాలని దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం గుర్తును కేటాయించామని బుకాయించారు. మద్దిశెట్టి మాట్లాడుతూ అభ్యర్థి తన నామినేషన్‌లో పలానా గుర్తులు కావాలని కోరలేదని, గుర్తులు కోరకపోతే నామినేషన్‌ చెల్లదని అయినా ఆ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. ఇండి పెండెంట్‌ అభ్యర్థులు సంతకం పెట్టి కింద డేట్‌ వేయలేదని నామినేషన్‌ను తిరస్కరించారని, గుర్తులు అడగకపోతే నామినేషన్‌ తిరస్కరించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఇలా పక్షపాత దోరణి మంచి పద్దతి కాదన్నారు.

25వ తేదీ నాటితో దరఖాస్తులు సమయం అయిపోయిందని 28వ తేదీన దరఖాస్తు తీసుకుని గుర్తును కేటాయించడం నిబందనలకు విరుద్ధం కాదా ? అని నిలదీశారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. హెలికాఫ్టర్‌ గుర్తు ఫ్యాన్‌ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు టీడీపీ నేతలు కనుసన్నల్లో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదని ఆరోపించారు. ఆగుర్తు ఇవ్వడానికి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తతంగం అంతా అన్నీ పార్టీలకు చెందిన అభ్యర్థుల కళ్లెదుటే జరుగుతున్నా.. మిగితా పార్టీలు ఈ విషయంపై నోరుమెదపకపోవడం గమనార్హం. ఆర్‌ఓ కృష్ణవేణి మాత్రం నిబంధనలు చూపిస్తానని చెప్పి పొంతన లేని నిబంధలను చెప్తున్నారని మండి పడ్డారు.

ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎన్నికలు సక్రమంగా జరగనిస్తారా అని మద్దిశెట్టి అనుమానాలు వ్యక్తం చేశారు. కృష్ణవేణి మాట్లాడుతూ తాను నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయించానని మీకు అభ్యంతరం ఉంటే రిటన్‌గా రాసి ఇవ్వాలని కోరారు. అనంతరం మద్దిశెట్టి వేణుగోపాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించి జరిగిన విషయాన్ని వివరించారు. కేవలం వైఎస్సార్‌ సీపీని దెబ్బతీయాలంటే ప్రజాభిమానం లేక అధికారులను ఉపయోగించుకుని ఈవిధంగా చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గెలవలేక ఇలాంటి నీచరాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు సరైన బుద్ది చెప్పాలని కోరారు. తమ అదిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఆగుర్తు కేటాయింపుపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement