
బొమ్మల కొలువులో చూసి.. సరేనన్నా!
చీకటిలో దారి చూపేది.. నిరాశలో ఆసరా ఇచ్చేది చల్లని సాహచర్యం. జీవితమంతా ఒకరి వెంట ఒకరిగా నిలచే ఆలుమగల అనుబంధం ఆ ఆత్మీయతను పంచి ఇస్తుంది.. కష్టాలకు ఎదురీది గట్టెక్కే బలాన్నిస్తుంది. పరస్పర విశ్వాసం, అవధుల్లేని అభిమానం వల్ల జీవితం మధురాతిమధురమవుతుంది. ఆ అనుబంధానికి నిదర్శనంగా నిలిచే కాట్రగడ్డ లక్ష్మీ వెంకట కృష్ణారావు, సునీతలే ఈ వారం యూ అండ్ ఐ.
కట్టుబట్టలతో వైజాగ్ వచ్చినా తన భార్య సునీత అందించిన సహకారంతోనే ఇంతవాడినయ్యానని చెప్పారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ (యూత్ ఎక్స్‌చేంజ్) కాట్రగడ్డ లక్ష్మీ వేంకట కృష్ణారావు. భార్యను తనతో సమానంగా గౌరవించే భర్త దొరకడం అదృష్టమని, ఆయన ప్రోత్సాహంతోనే లయన్ క్లబ్ విశాఖపట్నం గ్రేటర్ ప్రెసిడెంట్‌ను కాగలిగానని చెప్పారు సునీత. ఇగోలకు, ఫాల్స్ ప్రిస్టేజీకి పోకుండా ఉంటేనే దాంపత్యం చిరకాలం వర్థిల్లుతుందన్నారు ఇద్దరూ. తమ వివాహం, వైజాగ్‌లో సెటిల్ కావడం గురించి ఇలా వివరించారు.
కృష్ణారావు : మాది విజయవాడ. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో బీఏ చేశాను. చిన్నప్పటి నుంచి అన్నిట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవాడిని. స్కూల్లో, కాలేజ్‌లో స్టూడెంట్ లీడర్‌గా చేశాను. మా నాన్నగారు లయన్స్ క్లబ్ సభ్యుడు. నన్ను లయన్స్ క్లబ్‌లోని యూత్ వింగ్ లియోలో సభ్యుడిగా చేర్చి సేవాపథం వైపు నడిపించారు. 1989లో ప్రెసిడెంట్ అయ్యాను.
సునీత : నేను మాంటిస్సోరీలో చదివాను. స్కూలు, కాలేజ్ చదువు అక్కడే. గేమ్స్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొనేదాన్ని.
కృష్ణారావు : సునీత మా బంధువులమ్మాయే. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్‌లో, మా బంధువులింట్లో బొమ్మలకొలువులో చూసేవాడిని.
సునీత : మా పెద్దమ్మ ద్వారా ఈ సంబంధం వచ్చింది. బంధువులం కావడంతో ఇక అభ్యంతరమేముంటుంది. మరుసటిరోజే నిశ్చితార్థం అయింది.
కృష్ణారావు : నేను ఊరినుంచి వచ్చేసరికి నాన్నగారు వాళ్లు అమ్మాయిని చూసి వచ్చినట్లు చెప్పారు. పెళ్లికూతురు సునీతేనని తెలిసి వెంటనే ఓకే చెప్పేశాను. నిశ్చితార్థం అయ్యాక తను స్కూలుకు వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు రిక్షాలో తీసుకెళ్లి తీసుకు వచ్చేవాడిని.
సునీత : ఈయన ప్రేమలేఖలు కూడా రాశారు. ఒకటి, రెండు ఉత్తరాలకు మాత్రం బదులిచ్చానంతే. 1989లో ఆగస్టు 20న మా పెళ్లయింది. మా అత్తగారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వంటలన్నీ ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. పెళ్లయ్యాక లయన్స్ క్లబ్‌కు అనుబంధంగా ఉండే లయనెస్ క్లబ్‌కు ప్రెసిడెంట్‌నయ్యాను.
కృష్ణారావు : పెళ్లయ్యాక జీవనమార్గం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చేయమనడంతో ఇద్దరం వచ్చేశాం. ఒక స్నేహితుడి దగ్గర రూ.30,000 తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాను. సునీత ప్రెస్‌కు వచ్చి నాకు సహాయపడేది. తర్వాత ‘రావు టూర్స్ అండ్ ట్రావెల్స్’ స్టార్ట్ చేశాను.
సునీత : తర్వాత ద్వారకానగర్‌లో ‘ది నెస్ట్’ విమెన్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశాం.
కృష్ణారావు : మాకు ఇద్దరు పిల్లలు. ఒకవైపు హాస్టల్, ఇంకోవైపు పిల్లలు, మరోవైపు లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ .. అన్నీ సమర్థంగా నిర్వహించేది. తనకు స్ట్రెయిన్ ఎక్కువవుతోందని మూడేళ్ల క్రితం హాస్టల్ వేరేవారికి అప్పగించేశాం.
సునీత : ఇంటి విషయాల్లో ఈయన చాలా కోఆపరేట్ చేసేవారు. మా పిల్లలపై ఈయన ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువే.
కృష్ణారావు : పాప నిఖిత. ఇంజినీరింగ్ ఫైనలియర్. 2013-14 సంవత్సరానికి లియో ఆఫ్ ద ఇయర్‌గా ఎన్నికైంది. బాబు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్.
సునీత : లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఫుట్‌పాత్‌పై పడుకున్నవారికి రగ్గులు అందివ్వడం, తోటగరువు ప్రైమరీ స్కూల్ పిల్లలకు వస్తువుల సరఫరా.. చేపట్టాం.
కృష్ణారావు : జువైనల్ హోమ్‌కు వెళ్లి అక్కడి వారికి దుస్తులు, వంటపాత్రలు పంపిణీ చేసేవాళ్లం. తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది ఉత్సవాలు నిర్వహించాం. మా సహకారంతోనే ఇది సాధ్యమైంది.
సునీత : ఈయనలో స్నేహభావం ఎక్కువ. ఫ్రెండ్‌షిప్ అంటే ప్రాణం పెడతారు. పనిని సాధించేవరకు వదిలిపెట్టరు.
కృష్ణారావు : నేను ఏం చేసినా నా కుటుంబం నన్ను వెన్నంటే ఉంటుందన్న భావన నాకు చాలా బలాన్నిస్తుంది. సునీత, పిల్లలు నా ఎసెట్స్.