శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో స్వయంభుగా వెలసిన అఖిలాండ నాయకుడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు సోమవారం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.47 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనము,శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండ స్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి ఏడు గంటలకు త్రిశూలపూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 7 వరకు కొనసాగుతాయి.
4న బ్రహ్మోత్సవ కల్యాణం
బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు రాత్రి 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. రాత్రి 10గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సంప్రదాయానుసారం ఈ నెల 28న తిరుమల తిరుపతి దేవస్థానం, మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
విద్యుత్ దీపాల అలంకరణలో గంగాధర మండప కూడలి
బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు
26న స్వామిఅమ్మవారు భృంగివాహనంపై దర్శనమిస్తారు. 27న హంసçవాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణవాహనం, 2న పుష్పపల్లకీ మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహనసేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి.
5న రథోత్సవం
మహాశివరాత్రి పర్వదినాన వధూవరులయ్యే శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను మార్చి 5న రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం ఏర్పాటు చేశారు. దీనికి ముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. మార్చి 6న ఉదయం 9.30 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి.. వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు. 7వ తేదీన శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment