శివోహం..
శైవ క్షేత్రాలకు తరలివెళ్లిన భక్తులు
జిల్లాలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నింటిలోనూ శివుడు లింగాకారంలో ఉండడం మనకు తెలుసు. కానీ కొన్నిచోట్ల ఆలయాలలోనూ,ఆలయ ప్రాంగణాలలోనూ శివుడు విభిన్న రూపాలలో కనిపిస్తాడు. మహాశివరాత్రిసందర్భంగా జిల్లాలోని అలాంటి విభిన్న రూపాల శివయ్యల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -కడప కల్చరల్
నారీశ్వరుడు
పెద్దచెప్పలి శ్రీ అగస్త్యేశ్వరస్వామి గర్భాలయం ఎదుట శివపార్వతులు నందీశ్వరునిపై ఉన్న శిల్పాన్ని మనం చూడవచ్చు. ఇలాంటి శిల్పం జిల్లాలో మరెక్కడా కనిపించదు. రాష్ట్రేతర భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఈ శిల్పాన్ని ఆసక్తిగా తిలకిస్తారు. గర్భాలయంలోని శివలింగానికి పూజలు చేశాక అమ్మవారి సమేతంగా ఉన్న ఈ స్వామిని నందీశ్వరుడిని దర్శించుకుంటారు.
లింగోద్భవం..
సాధారణంగా ఏ ఆలయంలోనైనా విష్ణువు మానవుడిని పోలిన రూపంలో పలు అలంకారాలతో దర్శనమిస్తాడు. శివుడు మాత్రం లింగాకారంలోనే కనిపిస్తాడు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరిలో సాధారణ శివలింగాకారానికి భిన్నంగా కనిపిస్తాడు. శివరాత్రి నాడు శివుడు పుట్టుకను తెలిపే లింగ్భోదవ దృశ్యం ఈ శిల్పంలో ఉంది. జిల్లాలో అద్భుత శిల్పసంపదకు ఆటపట్టయిన పుష్పగిరి శ్రీ వైద్యనాథస్వామి ఆలయ ఆవరణంలో ప్రదర్శనగా ఉంచిన ఈ శిల్పాల్లో ఈ ప్రత్యేక శిల్పాన్ని మనం చూడవచ్చు.
మహా లింగం..
జిల్లాలో 18 అడుగుల శివుడు ఉన్నాడంటే నమ్మలేం కదూ. వేముల మండలం మోపూరు భైరవేశ్వరుని ఆలయం ఈ ప్రత్యేకతను కలిగి ఉంది. స్వయంభుగా పేర్కొనే ఈ 18 అడుగుల శివలింగం తెలుగునాట అత్యంత ఎత్తయిన శివలింగాలలో ఒకటిగా చెబుతారు. ఇంత ఎత్తై శివలింగానికి పూజలు చేయడం కష్టం గనుక దీనికి ఆలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించారు. పై అంతస్తు నుంచి అభిషేకాలు, కింది అంతస్తు నుంచి ఇతర పూజలు నిర్వహిస్తుంటారు.
సైకత లింగం
జిల్లాలో ఇసుక (సైకతం)తో తయారు చేసి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. దీన్ని శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. ప్రొద్దుటూరు ముక్తి రామేశ్వరాలయంలో ఈ శివలింగం ఉంది. రావణాసురుడిని హతమార్చిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వెళుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. రావణవధ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయదలిచి శివలింగం తెమ్మని హనుమంతుడిని కాశీకి పంపాడు. ఆయన రావడం ఆలస్యం కావడంతో పెన్నానది ఇసుకతో శ్రీరాముడు శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. రాయలసీమలో సైకత లింగం, రాముడే ప్రతిష్ఠించిన శివలింగం ఇదే కావడం విశేషం.
బ్రహ్మం చెక్కిన శిల్పం
శివుడికే కాకుండా జిల్లాలో శివుడి అంశ అయిన వీరభద్రుడికి కూడా ఆలయాలున్నాయి. అల్లాడుపల్లె గ్రామంలో కుందూ తీరాన గల వీరభద్రస్వామి ఆలయం మూల విరాట్ దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తు ఉంది. దీన్ని కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వయంగా మలిచి ప్రతిష్ఠించారని చెబుతారు. స్వామి మూల విరాట్ కంటే ఆలయంలోకి వెళ్లే ద్వారం తక్కువ ఎత్తులో ఉంది. స్వామి ఎదుట ఎవరైనా తలవంచుకుని వెళ్లవలసిందేనన్న ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పుకుంటారు.