నీళ్లల్లో మహానంది | Mahanandi Temple was filled with flood waters | Sakshi
Sakshi News home page

నీళ్లల్లో మహానంది

Published Wed, Sep 18 2019 3:55 AM | Last Updated on Wed, Sep 18 2019 9:00 AM

Mahanandi Temple was filled with flood waters - Sakshi

కర్నూలు జిల్లాలో జలదిగ్బంధంలో ఉన్న మహానంది ఆలయం

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలు, గుంటూరు, ఏలూరు నగరాల్లో లోతట్టు, శివారు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందితోపాటు నంద్యాల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పశ్చిమ గోదావరిలో పిడుగుపడి మహిళ మృతి చెందగా.. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వైఎస్సార్‌ జిల్లాలో ఆటో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న దంపతులతోపాటు రెండేళ్ల చిన్నారి గల్లంతైంది. కర్నూలు జిల్లా కానాల గ్రామానికి చెందిన ఓబులేసు, రవి, నాగిరెడ్డి  పాలేరు వాగు దాటేందుకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయారు.  అయితే అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి ప్రతినిధి, కడప/సంజామల/సాక్షి, నెట్‌వర్క్‌: గుంటూరులో లోతట్టు, శివారు కాలనీలు నీటమునిగాయి. సత్తెనపల్లి–హైదరాబాద్‌ మార్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రధాన రహదారిపై వాగు పొంగిపొర్లడంతో వందల్లో వాహనాలు ఆగిపోయాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో పిడుగుపడటంతో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. దిగువ మెట్ట వద్ద కాచిగూడ రైలు నిలిచిపోయింది. గాజులపల్లె సమీపంలో రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుక్కునూరు మండలం కొండపల్లిలో పొలం పనిలో ఉన్న సుజాత అనే మహిళ పిడుగు పడి మృతి చెందింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగర పంచాయతీ పరిధిలో పిడుగు పడటంతో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి వెంకటేశ్వరరావు చెయ్యి కాలిపోయింది. దాములూరు కూడలి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండటంతో నందిగామ – వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు మండలం పాలకాయతిప్పలో మత్స్యకారులు వేటకు వెళ్లగా వరద ఉధృతికి బోటు తిరగపడింది. దీంతో ఐదుగురు మత్స్యకారులు బోటుపైకి ఎక్కి సమాచారం ఇవ్వటంతో పాలకాయతిప్ప మత్స్యకారులు, మెరైన్‌ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

సీమలో ఉప్పొంగిన వాగులు, వంకలు 
వైఎస్సార్‌ జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పెన్నా, కుందూ నదులు పొంగి ప్రవహించాయి. జమ్మలమడుగు, కడప ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు చెరువులు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. కుందూ వరద ఉధృతికి అల్లాడుపల్లె దేవలాలు, కామనూరు కాజ్‌వేలు నీటితో మునిగాయి. బంక చిన్నాయపల్లె గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు ప్రొద్దుటూరు డివిజన్‌లో 150 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 60 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా సుమారు రూ.8 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 660 హెక్టార్లలో పత్తి, 906 హెక్టార్లలో వరి, 120 హెక్టార్లలో జొన్న, 25 హెక్టార్లలో మొక్కజొన్నతోపాటు అరటి, పూలు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో విస్తారంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 63 మండలాల పరిధిలో ఒక్క రోజులోనే 25 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భారీ వర్షాలతో పరిస్థితి అతలాకుతలంగా మారింది.

నంద్యాల పట్టణంతోపాటు గ్రామాలను, పంట పొలాలను, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ ఫక్కీరప్ప నంద్యాలలోనే మకాం వేసి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. నంద్యాలలో శ్యామకాలువ ఉప్పొంగడంతో 30 గృహాలు నీట మునిగాయి. అందులో 40 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సంజామల మండలం ముదిగేడు, కమలపురి గ్రామాల మధ్య వాగులో 40 మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో సమీప గ్రామాల ప్రజలు బస్సు వెనుకవైపు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. చాగలమర్రి మండలం నేలపాడులో గొర్రెల కాపరులను తీసుకొచ్చేందుకు వెళ్లిన కొండయ్య, దావీదు, మహేష్, వినోద్‌ అనే వ్యక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు కాపాడారు.

వైఎస్సార్‌ జిల్లాలో చిన్నారి సహా దంపతుల గల్లంతు 
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు వంకలో వరద ఉధృతికి ఆటోలో ప్రయాణిస్తున్న కుటుంబం గల్లంతైంది. వివరాల్లోకెళ్తే.. సోమవారం రాత్రి 11.45 గంటలకు దువ్వూరు నుంచి ఆటోలో చిన్నారితో కలిసి భార్యాభర్తలు ప్రొద్దుటూరు మార్గంలో వెళుతున్నారు. రాధానగర్‌ సమీపంలోని కామనూరు వంక దాటుతుండగా వరద నీటి ఉధృతికి ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న ముగ్గురూ నీళ్లలో కొట్టుకుపోయారు. నీళ్లలో పడిపోయినా కుమార్తెను మాత్రం తండ్రి వదల్లేదు. చిన్నారిని భుజాన ఎత్తుకొని ఒక చోట ఒడ్డున నిల్చున్నాడు. అతడి భార్య కూడా సమీపంలోని నీటి మోటారు పైపును పట్టుకొని నిల్చుంది.

రక్షించండి అంటూ గట్టిగా కేకలు వేయడంతో రాధానగర్, కామనూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రూరల్‌ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్‌ అక్కడికి చేరుకుని నీళ్లలో దూకి వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. కొద్దిసేపటి తర్వాత చిన్నారితో సహా భార్యాభర్తలు నీళ్లలో కొట్టుకుపోయారు. గల్లంతైనవారు ఏ ప్రాంతానికి చెందిన వారనేది తెలియాల్సి ఉంది. రబ్బరు బోటు సాయంతో ప్రొద్దుటూరు, కడప అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ తెలియలేదు. పెద్దముడియం మండలం మేడిదిన్నెకు చెందిన మైల భాగ్యమ్మ పని నిమిత్తం వెళ్తూ తీగలేరును దాటే ప్రయత్నంలో నీటిలో పడి కొట్టుకుని పోతుండటం చూసి స్థానిక యువకులు కాపాడారు.   

మహానందీశ్వరుడిని చుట్టుముట్టిన వరద  
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానంది కోనేరులు సైతం నీటమునిగాయి. మహానందిలోని రుద్రగుండం కోనేరులో అతిపురాతనమైన పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాలు నీట మునిగిపోయాయి. గర్భాలయంలో వెలిసిన మహానందీశ్వరుడి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో నీళ్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి. రెండు కోనేరులు నిండిపోవడం, నీరంతా రాజగోపురం మార్గం ద్వారా బయటికి రావడంతో ఆలయ ప్రాంగణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement