సంఘటితమైతేనే బడుగుల మనుగడ సాధ్యం
► నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
► ఘనంగా మహాత్మజ్యోతిరావు పూలే,
► బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
నెల్లూరు(బృందావనం) : సంఘటితంగా పోరాటాలు సాగిస్తేనే బడుగుల మనుగడ సాధ్యమవుతుందని, నాడే మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేరుతాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నగరంలోని పురమందిరంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ, బీసీకులాల సమన్వయ కమిటీ, బహుజన టీచర్స్ అసోసియేషన్, మహిళాసాధికార సమన్వయకమిటీ, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పూలే (ఏప్రిల్11), అంబేడ్కర్(ఏప్రిల్14) జయంతులను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు మహాత్ముల జయంతులు, ఉత్సవాలు,వర్థంతులు జరిపితే సరిపోదన్నారు. వారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారి పిల్లలు చదివే పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని అందించి విద్యాభివృద్ధికి తోడ్పడితే వారు ప్రగతివైపు పయనిస్తారన్నారు. దక్షిణమధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జె.ఎన్.రాజు మాట్లాడుతూ పూలే, అంబేదడ్కర్‌లను బడుగుల దేవుళ్లుగా పేర్కొన్నారు.
వారి ఆశయాలు సాధించేందుకు అందరూ కృషిచేయాల్సిన అవసరముందన్నారు. తొలుత పూలే,సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ జీవితచరిత్ర పుస్తకాలను ఎమ్మెల్యే, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శిరీష, రాజు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున్‌యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, రొంపిచెర్ల శివరామయ్య ఆచారి, నాశిన భాస్కర్‌గౌడ్, డాక్టర్ మారం విజయలక్ష్మి, చదలవాడ రమణయ్య, షేక్ కాలేషా, మెతుకు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఊపిరి ఉన్నంత వరకు
జగన్‌కు అండగా ఉంటా : అనిల్, ఎమ్మెల్యే
బలహీనవర్గాని చెందిన తాను తన పినతండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 90 ఓట్లతో కొందరి కారణంగా ఓడానని, అయితే మళ్లీ నెల్లూరు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బీసీవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి గెలుపుకోసం కృషిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తన ఊపిరి ఉన్నంత వరకు అండగా ఉంటానన్నారు. బీసీల ఉన్నతికి తోడ్పడిన వారిలో రాష్ట్రంలో ఎన్టీరామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అగ్రగణ్యులని, వారిని ఎవరూ మరిచిపోరని కొనియాడారు.