నరసరావుపేటరూరల్/ఫిరంగిపురం, న్యూస్‌లైన్:‘మమ్మి డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లారు..ఇక నాకెవరున్నారు.. మరో 24 గంటల్లో హ్యాపీగా మ్యారేజ్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన మమ్మిడాడీ మాంసం ముద్దలయ్యారు’ అంటూ ఆ యువతి రోదిస్తున్న తీరు చూసి రావిపాడు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గతనెల 30 తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమై 45 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన గాలి బాలసుందరరాజు, మేరి విజయకుమారి దంపతుల మృతదేహాలు మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాయి. వారి మృతదేహాల కోసం బంధువులు ఆరురోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను ఎట్టకేలకు అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాగా కాలిపోయిన మృతదేహాలు మాంసం ముద్దల మూటలుగా గ్రామానికి చేరడంతో వారి కుమార్తె సౌమ్యను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. స్థానికులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. అశృనయనాల మధ్య మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
తొలుత బాలసుందరరాజు స్వగ్రామమైన 113 తాళ్ళూరుకు మృతదేహలు మంగళవారం ఉదయం చేరుకున్నాయి. చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. బంధువులు, మిత్రులు సందర్శించి వారి కుటుంబసభ్యులకు సానూభూతి తెలిపారు. మృతదేహాల అనవాళ్లు లేకుండా మూటల రూపంలో వచ్చిన మాంసపు ముద్దలను చూసి గ్రామస్తులు చలించిపోయారు. గ్రామంలోని పునీత అన్నమ్మ ఆలయంలో మృతదేహలను ఉంచి గుంటూరు బిషప్ డాక్టర్ గాలిబాలి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారిఆత్మలకు శాంతి చేకురాలని ప్రార్థించారు. అనంతరం మృతదేహాలను ఉదయం 11 గంటలకు రావిపాడు గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాలను అంబులెన్స్‌లో ఉంచి మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అములోద్భవిమాత ఆలయంలో ఉంచి పాస్టర్ బత్తినేని బాలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మృతదేహాలను ఖననం చేశారు.
కన్నీటి సంద్రమైన రావిపాడు
Published Wed, Nov 6 2013 1:31 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement