ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్షునిగా మహేంద్రదేవ్
సాక్షి, అమరావతి/తెనాలి: తెలుగు వ్యక్తికి అంతర్జాతీయ హోదా లభించింది. గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ(ఐఎఫ్‌పీఆర్‌ఐ) ట్రస్టీ బోర్డు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ నిర్వహించే ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశో ధనా సంస్థ వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు. మహేంద్రదేవ్ గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే సెస్‌కు తొమ్మిదేళ్ల పాటు డైరెక్టర్‌గా, కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం చైర్మన్‌గానూ పని చేశారు. ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్ష హోదాలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ఈ సంస్థ 42 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవిని అలంకరించిన రెండో భారతీయుడు మహేంద్ర దేవ్. గతంలో డాక్టర్ ఐషర్ జడ్జ్ అహ్లూవాలియా ఈ పోస్టును అలంకరించారు. ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, పరిష్కార మార్గాలను సూచించేందుకు 1975లో ఐఎఫ్‌పీఆర్‌ఐ ఏర్పాటయింది. మహేంద్రదేవ్.. ప్రముఖ సాహితీ వేత్త సూర్యదేవర సంజీవదేవ్ తనయుడు.