సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీలోకి మారేటప్పుడు ఆ పార్టీని స్తుతిస్తూ మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బాక్సైట్ జీఓల విషయంలో అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. గిరిజన సలహా మండలి ద్వారా గతంలో చంద్రబాబు లీజులు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టడంతో, తరువాత వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇచ్చిన జీఓను రద్దు చేశారని గుర్తు చేశారు. జీఓ నెంబర్ 97ను చంద్రబాబు ఇష్యూ చేస్తే వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినా పూర్తి స్థాయిలో రద్దు చేయనిది చంద్రబాబు ప్రభుత్వమేనని నిప్పులు చెరిగారు. బాక్సైట్ అనుమతులు, లీజులు అన్ని చంద్రబాబు ఇచ్చినవేనని తెలిపారు.
అటవీ హక్కులపై చంద్రబాబు తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజనులు, వారి ప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు వినలేదని చెప్పారు. ఐదేళ్ల పాలన సమయం అయిపోవడంతో అభివృద్ధి చూసి ఓట్లేయమని అడగకుండా, కొత్త పథకాలు పెడుతూ, ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారని తూర్పారబట్టారు. పసుపు కుంకుమ వంటి పథకాలు క్రింది స్థాయికి వెళ్ల లేదని తెలుసుకొని పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారన్నారు. బీజేపీతో కలసి ప్రయాణించినప్పుడు సాగించిన చంద్రబాబు చేతగాని పాలనను ప్రజలు మరచిపోలేదన్నారు. సాక్షి పత్రికను బహిష్కరించండి అంటూ సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజాస్వామ్యానికి మూలస్థంభం అయిన పత్రికా స్వేచ్చను హరించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. వాస్తవాలు ప్రచారం చేస్తున్నాయనే భయంతో సాక్షిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పత్రికలను బహిష్కరించాలన్న ఒక్క పిలుపుతో చంద్రబాబుకు ఓటమిపై భయం పట్టుకుందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment