వారంతా కూలి, నాలీ చేసుకుని బతుకు బండి లాగిస్తున్న శ్రమ జీవులు. తెల్లారి లేచి పనికి పోయి, వచ్చిన దానితో సం తృప్తిగా జీవిస్తున్న కార్మికులు. అలాంటి కర్షకులపై విధి పగబట్టింది. అగ్ని ప్రమాదం రూపంలో విరుచుకుపడింది. రక్తం చిందించి కూడబెట్టిన ఇల్లు, డబ్బు, ఆస్తులు, పశువు, పుట్రలను నిర్ధాక్షిణ్యంగా దహించి వేసింది. వారిని కట్టుబట్టలతో నిలబెట్టింది. కళ్లెదుటే సర్వస్వం అగ్నికి ఆహుతవుతుంటే ఏం చేయాలో తెలియక వారు చేసిన çహాహాకారాలు అక్కడున్న వారిని కదిలించి వేశాయి.
భోగాపురం(నెల్లిమర్ల): భోగాపురం మండలం భోగాపురం మేజర్ పంచాయతీ పరిధిలోని వనుంపేట గ్రామంలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 పూరిళ్లు, అంగన్‌వాడీ కేంద్రం కాలిపోయాయి. 11 మేకలు సజీవ దహనం కాగా, సుమారు రూ.45 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. వనుంపేటలో ఉన్న 15 శెట్టి బలిజ కులానికి చెందిన కుటుంబాల వారు నివసిస్తున్నారు. ఆడవారు వ్యవసాయ కూలీలుగా, మగవారు గీత కార్మికులుగా, కొబ్బరి తోటల్లో కాయలు దింపే కూలీలుగా పనిచేస్తుంటారు. కొంత మంది మేకలు కాచుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే మగవారు పనులకు వెళ్ళిపోయారు. ఆడవారు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ సమయంలో వనుం సన్యాశమ్మ అనే మహిళ దేవునికి దీపం పెట్టి పనికి వేళ్లేందుకు బయలు దేరింది. ఏమైందో ఏమో తెలియదు కానీ 9.45 ప్రాంతంలో ఉన్నట్టుండి ఆమె ఇంట్లో మంటలు చెలరేగాయి. కమ్మల ఇల్లు చూర్లు ఒకదానికి ఒకటి తగులుకుని ఉండడం, గాలి వేగం ఎక్కువగా ఉండడంతో మంటలు ఒక్కసారిగా> అన్ని ఇళ్లకు వ్యాపించాయి. ఆడవారు మాత్రమే ఉండడంతో సామాన్లను బయటకు తెచ్చుకోలేకపోయారు. ఉయ్యాల్లో ఉన్న పిల్లలను ముందుగా బయటకు తీసుకువచ్చారు. మగవారికి ఫోనులో అగ్ని ప్రమాదం వార్త చెప్పడంతో వారంతా పరుగున గ్రామానికి చేరుకున్నారు.
వారు గ్రామంలోకి వచ్చే సమయానికి ఇళ్లలోని సిలెండర్లు భారీ శబ్ధాలతో పేలుతూ దూరంగా ఎగిరి పడుతున్నాయి. అన్ని ఇళ్లల్లోనే సిలెండర్లు ఉండ డం, అప్పటికే మంటలు వ్యాపించడంతో ఎవరూ వాటి దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో అరగంటలోనే అంతా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తారకేశ్వరరావు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అంది ంచారు. జిల్లా కేంద్రం నుంచి రెండు వాహనాలు చేరుకున్నాయి. కానీ గ్రామానికి వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతో అగ్నిమాపక యంత్రాలు వచ్చేందుకు ఆలస్యం అయింది. అవి చేరుకునేటప్పటికే మొత్తం ఆగ్నికి ఆహుతైంది.
ప్రమాదంలో మైనపు నూకాలు, వనుం కనకరాజు, మైనపు రాముడు, మైనపు శ్రీను, గొర్లె గౌరి, గొర్లె అప్పన్న, గొర్లె బండియ్య, వనుం రాంబాబు, వనుం అప్పయ్యమ్మ, వనుం నర్సయ్య, వనుం అప్పారావు, వనుం చిన్న, వనుం కనకరాజు, బాడితమాని కనకరాజు, బాడితమాని అసిరోడు అనే వ్యక్తులకు చెందిన ఇళ్లతో పాటు అంగన్‌వాడీ కేంద్రం కూడా కాలి పోయింది. అలాగే గొర్ర్‌లె అప్పన్నకు చెందిన 11 మేకలు సజీవం దహనం అయ్యాయి. ఇటీవల తన ఆవులను అమ్మగా వచ్చిన రూ.40 వేలు కాలిపోయాయి. వనుం అప్పారావు గ్రామంలో మరుగుదొడ్లు కట్టిం చేందుకు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టిన రూ.70 వేలు దగ్ధమైయ్యా యి. 10 తులాల బంగారం కాలి బూడిదైంది. వనుం కనకరాజు ఇటీవల అమలాపురం వద్ద కొబ్బరికాయలు తీతలుకు వెళ్ళి తెచ్చుకున్న రూ.30 వేలు, వనుం రాంబాబుకి చెందిన రూ.25 వేలు కాలిపోయాయి. అలాగే ఇళ్లలో ఉన్న టీవీలు, బీరువాలు, వంట సామగ్రి, ఫ్యాన్లు, కరెంటు మీటర్లు, ప్రభుత్వ గుర్తింపుకార్డులు, భూముల కాగితాలు మొత్తం కాలిపోయాయి. వారంతా కట్టు బట్టలతో పొలాల్లో నిలబడ్డారు. సర్వం కళ్ళెదుట కాలిపోతుంటే చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలోకి వారు చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. విషయ ం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీకాంత్, వీఆర్‌ఓ రాజేష్, ఆర్‌ఐ పద్మ, పంచాయతీ ఈఓ రామకృష్ణ, విద్యుత్ ఏఈ పీఎఎస్.రామకృష్ణ సంఘటనా స్థలం వద్దకు చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.
భోజనాలు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు..
అగ్ని ప్రమాద బాధితులను వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు పరామర్శించారు. బాధితులకి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని, పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండు చేశారు. జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, కొమ్మూరు సు భూషణరావు, ఆళ్ళ విశ్వేశ్వరరావు బాధితులకు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. చీరలు, దుప్ప ట్లు అందించారు. సొసైటీ అధ్యక్షుడు సుందర గోవిందరావు బాధితులను పరామర్శించారు. పడాల శ్రీనివాసరావు బాధితులకు భోజనం ప్యాకెట్లని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment