గ్యాస్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి
Published Mon, Sep 2 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ :గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ కోరారు. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎల్‌పీజీ (డీబీటీఎల్) పథకాన్ని ఆదివారం స్థానిక మంగమూరురోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో ఆయన ప్రారంభించారు. అనంతరం గ్యాస్ వినియోగదారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెండో విడత ఈ పథకం ప్రారంభమైనట్లు వివరించారు. సబ్సిడీ నగదు నేరుగా వినియోగదారుల ఖాతాకు జమవుతుందన్నారు.
సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు సబ్సిడీపై అందిస్తారన్నారు. వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే వారి బ్యాంకు ఖాతాలో రూ.500 సబ్సిడీ నగదు జమవుతుందన్నారు. ప్రస్తుతం వినియోగదారుడు రూ.457 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. గ్యాస్ ధరలు పెరిగితే పెరిగిన ధరలకు అనుగుణంగా వినియోగదారుడు నగదు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా, సబ్సిడీ నగదు పక్కదారి పట్టకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎల్‌పీజీ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. తాజాగా ప్రవేశపెట్టిన విధానం వల్ల ఎక్కువ మంది కొత్త వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు పొందే వీలు కలుగుతుందన్నారు.
గ్యాస్ సబ్సిడీ పొందాలంటే సంబంధిత వినియోగదారులు విధిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, గ్యాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తమ ఏజెన్సీల్లో అందించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీలకు సంబంధించి 57 ఏజెన్సీలు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో 5లక్షల 66వేల 958మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేవలం లక్షా 53 వేల 333 మంది మాత్రమే నగదు బదిలీ పథకానికి వివరాలు అందించారన్నారు. క్యాష్ ట్రాన్స్‌ఫర్ కన్జూమర్(సీటీసీ) కింద గుర్తించి నగదు బదిలీ పథకం కింద ఆధార్, ఇతర వివరాలు అందించిన వారిని గుర్తించినట్లు తెలిపారు.
ఆధార్, ఇతర వివరాలు అందించని వారిని నాన్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ కన్జూమర్(ఎన్‌సీటీసీ) కింద పరిగణించి మూడు నెలల వరకు గడువు ఇస్తారని చెప్పారు. ఈ మూడు నెలలు వారికి సబ్సిడీపైనే గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు. ఆ తరువాత కూడా ఇవ్వకుంటే మార్కెట్ ధర ప్రకారం వారు గ్యాస్ సిలిండర్‌కు పూర్తి నగదు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా గ్యాస్ వినియోగదారుడు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి నగదు సబ్సిడీ పొందాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ కోరారు. సమావేశంలో ఎల్‌డీఎం ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement