సాక్షి, విజయవాడ: ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజల సమస్యలు మర్చిపోయారని, కానీ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నాయకులు ముసలివారిని పోగేసి వంకాయలు, టమాటాలు ఇచ్చి ధర్నాలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 55వ డివిజన్‌లో పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సాచురేషన్ విధానంలో ఇస్తున్న పెన్షన్‌లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా మూడు వేల మందికి పెన్షన్లు వెరిఫై చేస్తే 450 మాత్రమే తొలగించామని, 250 అప్‌లోడ్ చేశామని పేర్కొన్నారు. 55వ డివిజన్‌లో 11 వందల పెన్షన్ కార్డులు ఇచ్చామన్నారు. బాబు ఏ రోజైనా ఇన్ని పెన్షన్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇక నియోజకవర్గంలో 35 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సైతం టీడీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. (‘టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని మోసం’)
బాబు సైంధవుడిలా మారాడు
‘ఇల్లు ఇస్తామని టీడీపీ నాయకులు 15 వేల మంది దగ్గర రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. టీడీపీ పాలనలో ఇళ్లు దోచేసి అమ్ముకున్న టీడీపీ అవినీతిపై సీబీఐ, ఈడీ, లోకాయుక్తతో విచారణ జరిపిస్తాం. మా పథకాలపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. మేము జన్మభూమి కమిటీల్లాగా డబ్బులు వసూలు చేయడం లేదు. ఉచితంగా ఇళ్లు ఇస్తున్నాం. ప్రతి సంక్షేమ కార్యక్రమాలు సచివాలయం వేదికగా జరుగుతున్నాయి. వైఎస్సార్ నవశకంతో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబు పాలనలో వారి నాయకులు 24 గంటలు అవినీతి చేస్తుంటే..చూస్తూ ఉండి ఇప్పుడు బస్సు యాత్రలు చేస్తున్నారు. ప్రజల్లోకి చేరుకొనే సంక్షేమ ఫలాలను అడ్డుకునే సైందవుడిలా చంద్రబాబు మారారు’ అని మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు.(‘జన్మభూమి కమిటీల్లో లంచం ఇస్తే పెన్షన్ వచ్చేది’)
Comments
Please login to add a commentAdd a comment