అతడు చిరంజీవి!
కడుపులో నీళ్లు కదలకుండా, హాయిగా సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ, సవాలక్షమందిలో ఒకడిగా ఉంటే మల్లి మస్తాన్ బాబు బతికి ఉండేవాడేవాడోమో. కానీ అతడిని సాహసం అనే పురుగు తొలుస్తుంటే కుదురుగా బతకలేకపోయాడు. అడ్వెంచర్నే ఆక్సిజన్గా మార్చుకున్నాడు. అయితే విచిత్రంగా అతడు ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. పర్వతారోహణ సంస్థల వద్దకు వెళ్లి శాస్త్రీయంగా కొండలెక్కడం నేర్చుకోలేదు. అతడిలో ఉన్న సాహస ప్రవృత్తే మస్తాన్ బాబుకు ఆ విద్యను నేర్పింది, ఏదైనా సాధించాలన్న తపనే అతడిని ఏడు ఖండాల్లోని ఏడు కొండలను ఎక్కించింది. అతడు శిఖరాల్ని ఎంతగా ప్రేమించాడంటే - తన ప్రేమలో ఎన్పటికైనా ప్రమాదముంటుందన్న భావనతో అతడు పెళ్ళి కూడా చేసుకోలేదు.
నెల్లూరు జిల్లాలోని ఓ పల్లెటూళ్లో, అందులోనూ అట్టడుగు వర్గంలో పుట్టిన మస్తాన్ బాబు పర్వతారోహకుడిగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించాడు. అయితే మన నేల మీద మాత్రం అతడు చనిపోయిన తర్వాతే ఎక్కువమందికి తెలిసి ఉంటాడు. ఇందులో మనవారి తప్పేమీ లేదు. మనకి సినిమా హీరోలు, రాజకీయ నాయకులు పట్టినంతగా సాహసికుల్లో, శాస్త్రవేత్తలో పట్టరు. నిజమైన హీరోలను బతికున్నప్పుడు పట్టించుకోకపోవటం అసలైన విషాదం.
సాహసమే ఊపిరిగా బతికి మస్తాన్, ఒంటిరిగా వెళ్లి కొంత దుస్సాహసం చేశాడనే చెప్పాలి. మంచు విపరీతంగా కురిసే ప్రాంతాల్లో - శరీరాన్ని నిరంతరం వేడిగా ఉంచుకోవాలి. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ, బయట ఉన్న ద్రవ పదార్థాలు మంచులా గడ్డకట్టేనట్టే శరీరం లోపలి ప్లూయిడ్స్ కూడా క్రిస్టల్స్ గా మారే ప్రమాదముంటుంది. దాంతో పల్మనరీ ఓడిమా, సెరిబ్రల్ ఓడిమా అనే రుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదముంది. దీంతో కొన్ని గంటల్లో స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పక్కన తోడు లేకపోతే అది అంతిమంగా మృత్యువుకి దారి తీయొచ్చు.
పర్వతారోహణలో ఏళ్ల తరబడి అనుభవంతో పండిపోయిన మస్తాన్ కి ఈ మాత్రం విషయాలు తెలీయవనుకోలేం. సాధించాలి, జయించాలి అన్న తొందరే అతడిని ఒంటరిగా వెళ్లే దుస్సాహసానికి పురికొల్పిందని భావించొచ్చు. ఎవరెస్ట్ ఎక్కిన తొలి తెలుగువాడిగా, ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన భారతీయుడుగా మస్తాన్ సృష్టించిన రికార్డులు, అతడి స్పూర్తి ఎప్పటికీ మిగిలే ఉంటాయి. చనిపోయినా అతడు చిరంజీవి!