మస్తాన్ మృతదేహాన్ని దించారు
న్యూఢిల్లీ: పన్నెండు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అర్జెండీనా ఆండీస్ పర్వతాల్లో అసువులు బాసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ట్రెక్కింగ్ నిపుణులు కిందకు దించారు. ఉత్తర అర్జెంటీనాలోని టుకుమాన్ అనే నగరానికి తరలించారు. వీలైనంత త్వరగా మృతదేహానికి పంచనామా, పరీక్షలు నిర్వహించి భారత్కు పంపిస్తారు. ఈ వారం చివరిలోగా మల్లి మస్తాన్ బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉందని అతడి స్నేహితుడు సత్యం బీం సారెట్టి తెలిపాడు. ఇప్పటికే మస్తాన్ బాబు సోదరి డాక్టర్ మల్లి దొరసానమ్మ అర్జెంటీనాకు తరలి వెళ్లారు.
గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు ఏప్రిల్ 3న అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతిచెందిన అతడి మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ప్రారంభంలో కాస్తంత ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం అయినా ఆ తర్వాత వాతావరణం మెరుగుపడటంతో ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం బేస్ క్యాంపునకు చేరుకుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అన్ని రకాల అనుమతులను తీసుకుంది.