స్వాప్నికుడూ... సాహసీ!
జయప్రభ
నాకన్పిస్తుంది. సృష్టిలోని ప్రతి పర్వతమూ ఒక సాలగ్రామమే అని. ప్రతి మహోన్నత శిఖరమూ ఒక ఆలయ గోపురమే అని. శిఖరారోహణ చేసే ప్రతిసారీ తనతో పాటుగా రుద్రాక్షమాలని చేతపట్టుకుని వెళ్లే మస్తాన్‌బాబు కూడా బహుశా నాలాగే భావించి ఉంటాడు. పర్వత శిఖరాలు అతడిని అమితంగా ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షణని అతడు నిలువరించుకోలేడు.
పర్వతాల ఎత్తులకి ఎగబాకే క్రమంలో ఒంటరి పర్వతారోహకుడు ఒక సాధకుడౌతాడు. నిట్టనిలువు కొండలని కొలిచే వేళ గండ శిలలపై మృదువుగా తన చెక్కిలి నానించి సున్నితమైన వాటి సుబోధలని గ్రహించగలడు. తానొక్కడే రాత్రివేళ గుడారపు మధ్యలో ముడుచుకుని తన చుట్టూ ఆవరించి ఉన్న గాఢతర నిశ్శబ్దంలోంచి చరాచరపు ఊసులకి ఊ కొట్టగలడు. మబ్బు తెరల మధ్యనించి కురిసే మంచు నించి తరచూ తనతో కరచాలనం చేసే హిమ స్పర్శని చల్లగా అందుకోగలడు. రాత్రి ఏకాంతంలో చుక్కల వెలుగు మధ్య అనంతమైన ఆకాశపుటందాలని చూడగలడు. తాను సిద్ధంగా ఉండని, తాను ముందుగా ఊహించని సంక్లిష్టతలని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శాంత చిత్తంతో ఆ స్థితి ముందు అతడు నిలబడగలడు.
జీవితం ఎంత అస్థిరమో, ఎంత బుద్బుదమో అనుక్షణం గ్రహింపుకి వచ్చే క్రమంలో అతడు ఇతరులకెందరికో అంత సులువుగా అర్థం కాని, వారికెవ్వరికీ అనుభవంలోకి రాని అరుదైన జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. సరిగ్గా ఇలాంటి జ్ఞానవంతుడినే ఆరోజు నేను మల్లి మస్తాన్‌బాబులో చూశాను. మస్తాన్‌బాబుని గురించి ఒకరోజు ఇలా రాయవలసి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. నిరంతర సంచారి అయిన మల్లి మస్తాన్‌బాబుని గురించి. సాహసి అయిన మస్తాన్ గురించి...
ఇది 2007లో జరిగిన విషయం అని గుర్తు. ఏదో వార్తాకథనం లోంచి నేను మల్లి మస్తాన్‌బాబుని గురించి తెలుసుకున్నాను. మిత్రులనడిగి అతడి ఫోన్ నంబరు తీసుకుని, అతడితో మాట్లాడి, అతడిని అభినందించి, మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. నా సంరంభానికీ, అతడు నాలో కల్గించిన గర్వానికీ అప్పుడు ఒక కారణం ఉంది. తెలుగువాడిగా, భారతీయుడిగా మల్లి మస్తాన్‌బాబు గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతడు సాధించిన విషయం మామూలుది కాదు. ప్రపంచంలోని ఏడు ఖండాలలో ఉన్న ఎత్తయిన ఏడు శిఖరాలనీ అప్పటిదాకా ఎక్కినవారి వేగాన్ని తాను అధిగమించటం.
ఆరోజు చెప్పిన సమయానికల్లా అతడు మా ఇంటికి వచ్చాడు. ముప్ఫై మూడేళ్ల యువకుడు. చాలా వినయం. ఎంతో ఆత్మవిశ్వాసం. తాను చెప్పే విషయాల మీద అతడికున్న సాధికారత నాకెంతో నచ్చింది. ఆ అబ్బాయి మీద వాత్సల్యం ఏర్పడింది. ఆ తరువాత చాలా సునాయాసంగా గంటలకొద్దీ కబుర్లు చెప్పుకున్నాం. కొండలెక్కడంలో పసితనంలోనే అతడిలో ఏర్పడిన ప్రేమ - పెద్దయ్యాకా ఎక్కడా ఏ శిక్షణా తీసుకోకుండానే ఇన్ని అద్భుతాలు చేసేలా చేసింది. అత్యున్నత విద్యాసంస్థల్లో ఎంతో చదువుకుని కూడా అతడు ఉద్యోగాల వైపు ఆలోచించకపోవడంలో అతడి దృఢ దీక్ష వ్యక్తమయ్యింది.
నీ గురించి తెలుగువారికి తెలుసా? అని అడిగాను. తన స్నేహితులకీ, బయట రాష్ట్రాల వారికీ, బయటి దేశాల వారికీ తన గురించి ఎక్కువ తెలుసని చెప్పాడు. తెలుగువారికి ఏమంత శ్రద్ధ ఉన్నట్టు లేదని ఆ రోజు అతడి మాటల వలన నాకు అర్థమైంది. చాలామందికి అర్థం కాదు మేడమ్! కొండలెక్కుతాడంట అని అంటుంటారని చిరునవ్వుతో అనడం ఆ రోజు నా మనసుని ఇబ్బంది పెట్టిన విషయం.మనుచరిత్రలోని ప్రవరాఖ్యుడి కుతూహలం నాది. అతడు చేసిన ఆ సాహసంలో అతడెదుర్కొన్న సంఘటనల గురించీ అతడి అనుభవాల గురించీ అడిగి తెలుసుకున్నాను. ఎంతో సంతోషంతో మస్తాన్ వాటినన్నింటినీ నాతో పంచుకున్నాడు. అంతేకాదు త్వరలోనే తాను సిమ్లా ఎక్స్‌పెడిషన్ క్యాంపు చేయబోతున్నట్టు చెప్పి, అందులో నన్ను కూడా పాల్గొనమని అడిగాడు.
నిజానికది నాకు ఇష్టమే. అన్నమయ్య పదాల మీద మొదటి సంపుటం రాసి అచ్చువేసిన అలసటతో ఉన్నాను. కానీ మనసుకున్న ఉత్సాహం శరీరానికి లేక, అతడి కోరిక ప్రకారం అలాగే వస్తానని అనలేకపోయాను. అతడికి నా కవిత్వాన్ని వినిపించాను. ఎంతో శ్రద్ధతో విన్నాడు. నా పుస్తకాలన్నీ కొని వాటిమీద నా సంతకాన్ని తీసుకున్నాడు. మర్నాడు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు. మళ్లా సరిగ్గా చెప్పిన సమయానికల్లా వచ్చాడు. వస్తూ ఒక పార్కర్ పెన్ సెట్‌ని నాకు బహుమతిగా ఇచ్చాడు. మళ్లీ కొన్ని గంటలు గడిపి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత నా రచనలు తనకి చాలా నచ్చాయని చెబుతూ, ఫోన్లు చేసి మాట్లాడేవాడు. అలా ఒక ఏడాది పాటు మామధ్య సంభాషణ నడిచింది.
ఆ తరువాత నేను అన్నమయ్య పదాల మీద మరో పెద్ద పుస్తకం రాయడానికి తలపెట్టడంతో ఆ పనులలో పడి అన్నింటినీ మరిచిపోయాను. తిరిగి ఈ విషాద వార్తతో మస్తాన్ బాబుని గురించిన జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.ఎక్కడో పెన్న వొడ్డున పల్లెలో పుట్టి... ప్రపంచవ్యాప్తంగా పర్యటించినవాడు. అతి సామాన్య కుటుంబంలోంచి వచ్చి అసాధ్యాలెన్నో సాధించినవాడూ... మస్తాన్‌బాబు! పర్వతారోహకులని వారి వారి దేశాలు సమున్నత రీతిలో సత్కరించాయి. వారి పేర మౌంటనీరింగ్ సంస్థలని నెలకొల్పాయి. సర్ బిరుదాన్ని, నైట్ హుడ్ లాంటి హోదానీ బహూకరించుకున్నాయి. వారి పేర్లని ముఖ్యమైన రోడ్లకి పెట్టాయి. మరి మస్తాన్‌బాబుకి ఈ దేశం ఏమి చేయబోతోంది?
(వ్యాసకర్త ప్రముఖ కవయిత్రి)