ఆ సాహసికుడు.. ఇక రాడు | Now comes the adventurer .. | Sakshi
Sakshi News home page

ఆ సాహసికుడు.. ఇక రాడు

Published Sun, Apr 5 2015 1:30 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

ఆ సాహసికుడు.. ఇక రాడు - Sakshi

ఆ సాహసికుడు.. ఇక రాడు

  • పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి
  •  ఆండీస్ పర్వతాల్లో మృతదేహం గుర్తింపు
  • సంగం/న్యూఢిల్లీ/హైదరాబాద్: పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు మృతిచెందారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. పర్వతాలు తమకు ఇష్టమైన బిడ్డను తమలోనే కలిపేసుకున్నాయంటూ ఫేస్‌బుక్‌లో ఆయన స్నేహితులు శనివారం నివాళులర్పించారు.

    శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగం గ్రామానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతుల ఐదో సంతానం మస్తాన్‌బాబు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడ్డారు. బేస్‌క్యాంపు వరకు వెళ్లిన మస్తాన్ టీం ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆగింది.ఎన్నో ఎత్తై శిఖరాలను అవలీలగా అధిరోహించిన అతను ప్రతికూల వాతావరణాన్ని పట్టించుకోకుండా మార్చి 24వ తేదీన పర్వతారోహణ ప్రారంభించారు.

    అదేరోజున ఆయన జీపీఎస్ నెట్‌వర్క్ పనిచేయటం మానేసింది. కంగారుపడిన అతని స్నేహితులు ఈ విషయాన్ని అతడి సోదరి దొరసానమ్మకు తెలిపారు. ఆమె ఈ విషయమై కేంద్రప్రభుత్వ సహాయాన్ని కోరారు. దీంతో కేంద్రం అర్జెంటీనా, చిలీ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీలతో మాట్లాడింది. దీంతో అర్జెంటీనా, చిలీ ప్రభుత్వాలు కూడా ఏరియల్ సర్వేకి హెలికాప్టర్లు పంపాయి. రెండు హెలికాప్టర్లు శోధించినా మస్తాన్‌బాబు జాడ తెలియలేదు. అతడి స్నేహితులైన పర్వతారోహకులు అతడిని వెదికేందుకు బృందాలుగా వెళ్లారు. వారు శనివారం తెల్లవారుజామున మస్తాన్‌బాబు మృతిచెందినట్లు గుర్తించారు. పర్వతారోహణ చేసి దిగుతూ, బేస్ క్యాంపునకు 500 మీటర్ల ఎత్తులో పడిపోయినట్లు సమాచారం. మస్తాన్‌బాబు మృతదేహాన్ని బేస్‌క్యాంపునకు తీసుకొచ్చి అతడి సోదరికి సమాచారం తెలిపారు.
     
    పల్లె ఒడి నుంచి..

    గాంధీజనసంగం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతులకు 1974లో మస్తాన్‌బాబు జన్మించారు. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను, 4, 5 తరగతులు సంగంలోని ఓ ప్రైవేటు పాఠశాలలోను చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. అప్పటినుంచే అతడికి పర్వతారోహణ మీద ఆసక్తి కలిగింది. 1992 నుంచి 1996 వరకు జంషెడ్‌పూర్‌లోని నిట్‌లో బీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 1996 నుంచి 1998 వరకు ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు. 1998 నుంచి 2001 వరకు సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేశారు.  
     
    పాఠశాల స్థాయి నుంచే అవార్డులు

    మస్తాన్‌బాబు కోరుకొండలో చదివే సమయంలో నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్స్ ఎగ్జామినేషన్లో మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. 1992లో బెస్ట్ స్విమ్మర్ అవార్డు పొందారు. జంషెడ్‌పూర్ నిట్‌లో అథ్లెటిక్ కెప్టెన్‌గా వాలీబాల్, స్విమ్మింగ్ పోటీల్లో అవార్డులు పొందారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో వాటర్‌పోలోతో పాటు వాలీబాల్ పోటీల్లోనూ విజేతగా నిలిచారు. కలకత్తా ఐఐఎంలో డాక్టర్ బీసీరాయల్ అవార్డును అందుకున్నారు.
     
    చెన్నైకి భౌతికకాయం: వెంకయ్య

    మస్తాన్‌బాబు మృతికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మృతదేహాన్ని కేంద్రం చెన్నై విమానాశ్రయానికి పంపుతుందన్నారు. అక్కడి నుంచి అతడి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. మస్తాన్‌బాబు మృతి వార్త తెలిసిన వెంటనే వెంకయ్య విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి భౌతికకాయాన్ని తీసుకురావాలని కోరారు.
     
    సీఎం చంద్రబాబు, జగన్ సంతాపం


    మస్తాన్‌బాబు మృతికి సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే మంత్రి నారాయణ కూడా తన సంతాపాన్ని తెలిపారు.
     
    అమెరికా తీసుకెళ్తానన్న నాబిడ్డ ఎక్కడ

    నా బిడ్డ ఎక్కడ అంటూ మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నన్ను అమెరికా తీసుకెళతానన్న నా కుమారుడు ఎక్కడున్నాడయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తోంది. నా కుమారుడికి నీ పేరు పెట్టుకున్నందుకు నాకు కడుపుకోత మిగులుస్తావా మస్తాన్‌బాబా అంటూ కసుమూరు మస్తాన్‌స్వామిని తలచుకుంటూ ఆమె విలపించింది.
     
    మస్తాన్‌బాబు తల్లిని ఓదార్చిన ఎంపీ, జెడ్పీ చైర్మన్
    మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఓదార్చారు. అతడి సోదరి దొరసానమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement