Mastan Babu
-
కడపలో దారుణం
వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో ఆదివారం దారుణ హత్య వెలుగు చూసింది. కడప రైల్వే కార్వర్టర్స్ వాచ్ మెన్ మస్తాన్ బాబును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మస్తాన్ బాబును హత్య చేసి.. పెట్రోల్ పోసి తగుల బెట్టారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు -
మస్తానయ్యా..లేవయ్యా!
సంగం: గాంధీజనసంఘం కన్నీటి సంద్రమైంది. మస్తాన్‌బాబు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించింది. మస్తాన య్యా.. లేవయ్యా అంటున్న రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. నెలరోజుల పాటు నిరీక్షణ వారి రోదనను ఆపలేకపోయింది. పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం గాంధీజనసంఘంలోని స్వగృహానికి రాత్రి ఏడు గంటలకు చేరింది. అప్పటికే వేలాదిమంది అభిమానులు, బంధువులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. నెలరోజులుగా కుమారుడి కోసం ఎదురుచూసిన ఆ తల్లి రోదనకు అంతే లేకుండాపోయింది. సోదరుడు ఎప్పుడు వస్తాడా అని చూసిన అన్నలకు తీరని గుండె కోత మిగిల్చింది. అర్జెంటీనాలో ప్యాక్ చేసిన ఆ మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. పక్కాగా ప్యాక్ చేసిన వాటిని కొయ్యపని వాళ్లతో తొలగించి, మస్తాన్‌బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. హిందూ సంప్రదాయం ప్రకారం మస్తాన్ బాబుకు తెల్లటి పంచె కట్టి, ముఖానికి పసుపు రాసి ఫ్రీజర్‌లో ఉంచారు. అనంతరం మృతదేహంపై జాతీయ జెండాను కప్పారు. జోహార్ మల్లి మస్తాన్‌బాబు అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు తమ ముందే పెరిగి ఉన్నతస్థాయికి ఎదిగిన మస్తాన్‌బాబు విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో గాంధీజనసంగం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని రాష్ట్ర మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు ఎమ్మెల్యే పోలంరెడ్డి, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, బీద మస్తాన్‌రావు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయ్రామిరెడ్డి సందర్శించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గొప్ప సాహసి, దేశభక్తుడ్ని కోల్పోయామన్నారు. మస్తాన్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. వారి వెంట టీడీపీ నేతలు కన్నబాబు, బత్తల హరికృష్ణ , గుళ్లపల్లి శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు దేవసవహాయం, సర్పంచ్ మానికల సుజాత తదితరులు ఉన్నారు. బరువెక్కిన హృదయంతో నాన్సీ నెలరోజులుగా తన గురువు, స్నేహితుడ్ని చూడాలని పరితపించిన నాన్సీ మస్తాన్‌బాబు మృతదేహం చూసి తీరని ఆవేదనకు గురైంది. బరువైన హృదయంతో మస్తాన్‌బాబును పలకరించింది. చివరిచూపును తన కెమెరాలో బంధించింది. -
కోలాహలంగా ‘అక్షర’ వార్షికోత్సవం
వెంకటాచలం : మండలంలోని సరస్వతీనగర్‌లో ఉన్న అక్షర విద్యాలయం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కోలాహలంగా జరిగాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, విద్యార్థులతో దేశభక్తిని చాటే నృత ప్రదర్శనలు చేయించారు. మల్లి మస్తాన్‌బాబు మృతి కి సంతాపంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు మన భారతదేశం నెలవు అని, అన్నీ దేశాలు మన సంప్రదాయాలను గౌరవిస్తున్నాయన్నారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన దేశాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రదేశాల సరసన నిలబెడుతారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అక్షర విద్యాలయం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా అభివర్ణించారు. చిన్నతనం నుంచి విద్యార్థులకు దేశ భక్తిని పెంపొదిస్తున్న అక్షర విద్యాలయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీసిటీ అధినేత రవిసన్నారెడ్డి , బీజేపీ నేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, స్వర్ణభారత్ట్రస్టీ అట్లూరి అశోక్, ఐ.దీపావెంకట్, ఐ.వెంకట్, ప్రిన్సిపల్ కుముద పలువురు బీజేపీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు
-
మస్తాన్‌బాబుకి సాక్షి నివాళి!
-
అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి
సంగం: పర్వాతారోహకుడు మస్తాన్‌బాబు మృతదేహాన్ని అర్జెంటీనా నుంచి ఆయన స్వగ్రామానికి తరలిస్తుండడంతో అక్కడి భారత ఎంబసీ అధికారులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మస్తాన్‌బాబు సోదరి దొరసానమ్మ ఫేస్బుక్లో వివరాలను పొందుపరిచారు. మువ్వన్నెల జెండా పక్కన మస్తాన్‌బాబు ఫొటోలను పుష్పగుచ్ఛాల మధ్య ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మస్తాన్‌బాబు సాహసాలను వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దొరసానమ్మతో పాటు అర్జెంటైనాలోని భారతీయ ప్రతినిధుల బృందం పాల్గొంది. -
మల్లీ.. ఎప్పుడొస్తావ్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మల్లి మస్తానయ్య.. సుబ్బమ్మల ఐదుగురు సంతానంలో మస్తాన్‌బాబు చివరివాడు. చివరివాడే అయినా.. ఆ అమ్మకు ముద్దుల కొడుకు. ఐదుగురు కలిసి ఓ రోజు మాలో ఎవరంటే నీకిష్టం అని తల్లి సుబ్బమ్మను అడిగారు. తడుముకోకుండా ‘చిన్నోడు మస్తాన్‌బాబు అంటే నాకు ఇష్టం’ అని ఆ తల్లి తేల్చిచెప్పింది. అదేవిధంగా తల్లి సుబ్బమ్మ అన్నా.. మస్తాన్‌బాబుకు ఎనలేని ప్రేమ. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని తెలిస్తే.. మస్తాన్‌బాబు ఎక్కడున్నా రెక్కలు కట్టుకువచ్చి అమ్మ ముందు వాలిపోతాడు. ముద్దులకొడుకు కంటికి కనిపిస్తే సుబ్మమ్మ రోగం గీగం మాయమవుతుంది. అంతగా ఇష్టపడే కొడుకు నెలరోజులుగా కంటికి కనిపించలేదు. సజీవంగా వస్తాడన్నా.. ఇక రాలేడు. అయినా ఆ మాతృహృదయం ముద్దుల మల్లి మృతదేహం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. చివరివాడే అయినా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కన్నకొడుకు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం కోసం సుబ్బమ్మ 30 రోజులుగా నిద్రాహారాలు మాని ఎదురుచూడటం చూస్తే.. బహుశా ప్రపంచంలో ఏ తల్లికీ ఇంతటి కష్టం వచ్చి ఉండదేమో. పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కనిపించకుండా పోయి నేటి సరిగ్గా నెలరోజులు. గతనెల 25న మస్తాన్‌బాబు కనిపించలేదని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పర్వతాల్లో మస్తాన్‌బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈనెల 4న మస్తాన్‌బాబు మృతిచెందారని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మస్తాన్‌బాబు కనిపించలేదని తెలిసే తల్లి సుబ్బమ్మ తల్లడిల్లిపోయింది. కన్నకొడుకు మరణించాడని తెలిసి అమె గుండెలవిసేలా విలపించింది. ఇప్పటికీ విలపిస్తూనే ఉంది. సుబ్బమ్మతోనే... గాంధీజనసంఘం కన్నతల్లికే కాదు.. కన్న ఊరికీ పేరుతెచ్చిపెట్టాడు మల్లి మస్తాన్‌బాబు. అందుకే జన్మనిచ్చిన ఊరు గాంధీజనసంఘం కూడా మౌనంగా రోదిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహకుడిగా గుర్తింపు పొందిన మస్తాన్‌బాబు మరణం కన్నతల్లిని.. జన్మనిచ్చిన ఊరిని శోకలోయల్లోకి తోసేసింది. మస్తాన్‌బాబుకి ప్రకృతి అంటే అంత ప్రేమ. అందుకే గ్రామంలో ఉంటే ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ గడిపేవాడని స్నేహితులు చెబుతున్నారు. జిల్లా పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపిన వ్యక్తి మల్లి మస్తాన్‌బాబు మృతదేహం నేటి రాత్రికి గాంధీజనసంఘం చేరుకోనుంది. అందుకు జిల్లావాసులు అనేక మంది మస్తాన్‌బాబు మృతదేహానికి ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. జిల్లా నలుమూలల నుంచి మస్తాన్‌బాబు పార్థీవదేహాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలిరానున్నారు. -
మస్తాన్ మృతదేహాన్ని దించారు
న్యూఢిల్లీ: పన్నెండు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అర్జెండీనా ఆండీస్ పర్వతాల్లో అసువులు బాసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ట్రెక్కింగ్ నిపుణులు కిందకు దించారు. ఉత్తర అర్జెంటీనాలోని టుకుమాన్ అనే నగరానికి తరలించారు. వీలైనంత త్వరగా మృతదేహానికి పంచనామా, పరీక్షలు నిర్వహించి భారత్‌కు పంపిస్తారు. ఈ వారం చివరిలోగా మల్లి మస్తాన్ బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉందని అతడి స్నేహితుడు సత్యం బీం సారెట్టి తెలిపాడు. ఇప్పటికే మస్తాన్ బాబు సోదరి డాక్టర్ మల్లి దొరసానమ్మ అర్జెంటీనాకు తరలి వెళ్లారు. గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు ఏప్రిల్ 3న అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతిచెందిన అతడి మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ప్రారంభంలో కాస్తంత ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం అయినా ఆ తర్వాత వాతావరణం మెరుగుపడటంతో ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం బేస్ క్యాంపునకు చేరుకుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అన్ని రకాల అనుమతులను తీసుకుంది. -
స్వాప్నికుడూ... సాహసీ!
జయప్రభ నాకన్పిస్తుంది. సృష్టిలోని ప్రతి పర్వతమూ ఒక సాలగ్రామమే అని. ప్రతి మహోన్నత శిఖరమూ ఒక ఆలయ గోపురమే అని. శిఖరారోహణ చేసే ప్రతిసారీ తనతో పాటుగా రుద్రాక్షమాలని చేతపట్టుకుని వెళ్లే మస్తాన్‌బాబు కూడా బహుశా నాలాగే భావించి ఉంటాడు. పర్వత శిఖరాలు అతడిని అమితంగా ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షణని అతడు నిలువరించుకోలేడు. పర్వతాల ఎత్తులకి ఎగబాకే క్రమంలో ఒంటరి పర్వతారోహకుడు ఒక సాధకుడౌతాడు. నిట్టనిలువు కొండలని కొలిచే వేళ గండ శిలలపై మృదువుగా తన చెక్కిలి నానించి సున్నితమైన వాటి సుబోధలని గ్రహించగలడు. తానొక్కడే రాత్రివేళ గుడారపు మధ్యలో ముడుచుకుని తన చుట్టూ ఆవరించి ఉన్న గాఢతర నిశ్శబ్దంలోంచి చరాచరపు ఊసులకి ఊ కొట్టగలడు. మబ్బు తెరల మధ్యనించి కురిసే మంచు నించి తరచూ తనతో కరచాలనం చేసే హిమ స్పర్శని చల్లగా అందుకోగలడు. రాత్రి ఏకాంతంలో చుక్కల వెలుగు మధ్య అనంతమైన ఆకాశపుటందాలని చూడగలడు. తాను సిద్ధంగా ఉండని, తాను ముందుగా ఊహించని సంక్లిష్టతలని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శాంత చిత్తంతో ఆ స్థితి ముందు అతడు నిలబడగలడు. జీవితం ఎంత అస్థిరమో, ఎంత బుద్బుదమో అనుక్షణం గ్రహింపుకి వచ్చే క్రమంలో అతడు ఇతరులకెందరికో అంత సులువుగా అర్థం కాని, వారికెవ్వరికీ అనుభవంలోకి రాని అరుదైన జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. సరిగ్గా ఇలాంటి జ్ఞానవంతుడినే ఆరోజు నేను మల్లి మస్తాన్బాబులో చూశాను. మస్తాన్బాబుని గురించి ఒకరోజు ఇలా రాయవలసి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. నిరంతర సంచారి అయిన మల్లి మస్తాన్బాబుని గురించి. సాహసి అయిన మస్తాన్ గురించి... ఇది 2007లో జరిగిన విషయం అని గుర్తు. ఏదో వార్తాకథనం లోంచి నేను మల్లి మస్తాన్బాబుని గురించి తెలుసుకున్నాను. మిత్రులనడిగి అతడి ఫోన్ నంబరు తీసుకుని, అతడితో మాట్లాడి, అతడిని అభినందించి, మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. నా సంరంభానికీ, అతడు నాలో కల్గించిన గర్వానికీ అప్పుడు ఒక కారణం ఉంది. తెలుగువాడిగా, భారతీయుడిగా మల్లి మస్తాన్‌బాబు గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతడు సాధించిన విషయం మామూలుది కాదు. ప్రపంచంలోని ఏడు ఖండాలలో ఉన్న ఎత్తయిన ఏడు శిఖరాలనీ అప్పటిదాకా ఎక్కినవారి వేగాన్ని తాను అధిగమించటం. ఆరోజు చెప్పిన సమయానికల్లా అతడు మా ఇంటికి వచ్చాడు. ముప్ఫై మూడేళ్ల యువకుడు. చాలా వినయం. ఎంతో ఆత్మవిశ్వాసం. తాను చెప్పే విషయాల మీద అతడికున్న సాధికారత నాకెంతో నచ్చింది. ఆ అబ్బాయి మీద వాత్సల్యం ఏర్పడింది. ఆ తరువాత చాలా సునాయాసంగా గంటలకొద్దీ కబుర్లు చెప్పుకున్నాం. కొండలెక్కడంలో పసితనంలోనే అతడిలో ఏర్పడిన ప్రేమ - పెద్దయ్యాకా ఎక్కడా ఏ శిక్షణా తీసుకోకుండానే ఇన్ని అద్భుతాలు చేసేలా చేసింది. అత్యున్నత విద్యాసంస్థల్లో ఎంతో చదువుకుని కూడా అతడు ఉద్యోగాల వైపు ఆలోచించకపోవడంలో అతడి దృఢ దీక్ష వ్యక్తమయ్యింది. నీ గురించి తెలుగువారికి తెలుసా? అని అడిగాను. తన స్నేహితులకీ, బయట రాష్ట్రాల వారికీ, బయటి దేశాల వారికీ తన గురించి ఎక్కువ తెలుసని చెప్పాడు. తెలుగువారికి ఏమంత శ్రద్ధ ఉన్నట్టు లేదని ఆ రోజు అతడి మాటల వలన నాకు అర్థమైంది. చాలామందికి అర్థం కాదు మేడమ్! కొండలెక్కుతాడంట అని అంటుంటారని చిరునవ్వుతో అనడం ఆ రోజు నా మనసుని ఇబ్బంది పెట్టిన విషయం.మనుచరిత్రలోని ప్రవరాఖ్యుడి కుతూహలం నాది. అతడు చేసిన ఆ సాహసంలో అతడెదుర్కొన్న సంఘటనల గురించీ అతడి అనుభవాల గురించీ అడిగి తెలుసుకున్నాను. ఎంతో సంతోషంతో మస్తాన్ వాటినన్నింటినీ నాతో పంచుకున్నాడు. అంతేకాదు త్వరలోనే తాను సిమ్లా ఎక్స్‌పెడిషన్ క్యాంపు చేయబోతున్నట్టు చెప్పి, అందులో నన్ను కూడా పాల్గొనమని అడిగాడు. నిజానికది నాకు ఇష్టమే. అన్నమయ్య పదాల మీద మొదటి సంపుటం రాసి అచ్చువేసిన అలసటతో ఉన్నాను. కానీ మనసుకున్న ఉత్సాహం శరీరానికి లేక, అతడి కోరిక ప్రకారం అలాగే వస్తానని అనలేకపోయాను. అతడికి నా కవిత్వాన్ని వినిపించాను. ఎంతో శ్రద్ధతో విన్నాడు. నా పుస్తకాలన్నీ కొని వాటిమీద నా సంతకాన్ని తీసుకున్నాడు. మర్నాడు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు. మళ్లా సరిగ్గా చెప్పిన సమయానికల్లా వచ్చాడు. వస్తూ ఒక పార్కర్ పెన్ సెట్‌ని నాకు బహుమతిగా ఇచ్చాడు. మళ్లీ కొన్ని గంటలు గడిపి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత నా రచనలు తనకి చాలా నచ్చాయని చెబుతూ, ఫోన్లు చేసి మాట్లాడేవాడు. అలా ఒక ఏడాది పాటు మామధ్య సంభాషణ నడిచింది. ఆ తరువాత నేను అన్నమయ్య పదాల మీద మరో పెద్ద పుస్తకం రాయడానికి తలపెట్టడంతో ఆ పనులలో పడి అన్నింటినీ మరిచిపోయాను. తిరిగి ఈ విషాద వార్తతో మస్తాన్ బాబుని గురించిన జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.ఎక్కడో పెన్న వొడ్డున పల్లెలో పుట్టి... ప్రపంచవ్యాప్తంగా పర్యటించినవాడు. అతి సామాన్య కుటుంబంలోంచి వచ్చి అసాధ్యాలెన్నో సాధించినవాడూ... మస్తాన్‌బాబు! పర్వతారోహకులని వారి వారి దేశాలు సమున్నత రీతిలో సత్కరించాయి. వారి పేర మౌంటనీరింగ్ సంస్థలని నెలకొల్పాయి. సర్ బిరుదాన్ని, నైట్ హుడ్ లాంటి హోదానీ బహూకరించుకున్నాయి. వారి పేర్లని ముఖ్యమైన రోడ్లకి పెట్టాయి. మరి మస్తాన్‌బాబుకి ఈ దేశం ఏమి చేయబోతోంది? (వ్యాసకర్త ప్రముఖ కవయిత్రి) -
మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం
-
మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం
చిలీ: అర్జెంటీనా ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ఇంతకాలం ప్రతికూల వాతావరణం కారణంగా మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఎటువంటి యత్నాలు జరుగలేదు. అయితే గత మూడు రోజులుగా వాతావరణం మెరుగుపడటంతో మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సన్నద్ధమయ్యింది. దీనిలో భాగంగానే సహాయ బృందం బేస్ క్యాంపుకు చేరుకుంది. మరో ఐదుగురు సభ్యుల బృందం ట్రెక్కింగ్ ప్రారంభించింది. దీని కోసం భారత అంబాసీ అన్ని రకాల అనుమతులను తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం
సంగం (నెల్లూరు): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని పది రోజుల్లో భారత్‌కు పంపేలా చర్యలు తీసుకుంటామని చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ఆదివారం మీడియాకు తెలిపారు. చిలీలో ప్రతికూల వాతావరణం ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. అయితే మృతదేహాన్ని వారంలోగా పంపేలా చూడాలని తాను భారత ఎంబసీని కోరినట్లు ఆమె చెప్పారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆ సాహసికుడు.. ఇక రాడు
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి ఆండీస్ పర్వతాల్లో మృతదేహం గుర్తింపు సంగం/న్యూఢిల్లీ/హైదరాబాద్: పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు మృతిచెందారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. పర్వతాలు తమకు ఇష్టమైన బిడ్డను తమలోనే కలిపేసుకున్నాయంటూ ఫేస్బుక్లో ఆయన స్నేహితులు శనివారం నివాళులర్పించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగం గ్రామానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతుల ఐదో సంతానం మస్తాన్‌బాబు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడ్డారు. బేస్‌క్యాంపు వరకు వెళ్లిన మస్తాన్ టీం ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆగింది.ఎన్నో ఎత్తై శిఖరాలను అవలీలగా అధిరోహించిన అతను ప్రతికూల వాతావరణాన్ని పట్టించుకోకుండా మార్చి 24వ తేదీన పర్వతారోహణ ప్రారంభించారు. అదేరోజున ఆయన జీపీఎస్ నెట్వర్క్ పనిచేయటం మానేసింది. కంగారుపడిన అతని స్నేహితులు ఈ విషయాన్ని అతడి సోదరి దొరసానమ్మకు తెలిపారు. ఆమె ఈ విషయమై కేంద్రప్రభుత్వ సహాయాన్ని కోరారు. దీంతో కేంద్రం అర్జెంటీనా, చిలీ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీలతో మాట్లాడింది. దీంతో అర్జెంటీనా, చిలీ ప్రభుత్వాలు కూడా ఏరియల్ సర్వేకి హెలికాప్టర్లు పంపాయి. రెండు హెలికాప్టర్లు శోధించినా మస్తాన్‌బాబు జాడ తెలియలేదు. అతడి స్నేహితులైన పర్వతారోహకులు అతడిని వెదికేందుకు బృందాలుగా వెళ్లారు. వారు శనివారం తెల్లవారుజామున మస్తాన్‌బాబు మృతిచెందినట్లు గుర్తించారు. పర్వతారోహణ చేసి దిగుతూ, బేస్ క్యాంపునకు 500 మీటర్ల ఎత్తులో పడిపోయినట్లు సమాచారం. మస్తాన్‌బాబు మృతదేహాన్ని బేస్‌క్యాంపునకు తీసుకొచ్చి అతడి సోదరికి సమాచారం తెలిపారు. పల్లె ఒడి నుంచి.. గాంధీజనసంగం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతులకు 1974లో మస్తాన్‌బాబు జన్మించారు. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను, 4, 5 తరగతులు సంగంలోని ఓ ప్రైవేటు పాఠశాలలోను చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. అప్పటినుంచే అతడికి పర్వతారోహణ మీద ఆసక్తి కలిగింది. 1992 నుంచి 1996 వరకు జంషెడ్‌పూర్‌లోని నిట్‌లో బీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 1996 నుంచి 1998 వరకు ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు. 1998 నుంచి 2001 వరకు సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేశారు. పాఠశాల స్థాయి నుంచే అవార్డులు మస్తాన్‌బాబు కోరుకొండలో చదివే సమయంలో నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్స్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. 1992లో బెస్ట్ స్విమ్మర్ అవార్డు పొందారు. జంషెడ్పూర్ నిట్‌లో అథ్లెటిక్ కెప్టెన్‌గా వాలీబాల్, స్విమ్మింగ్ పోటీల్లో అవార్డులు పొందారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో వాటర్పోలోతో పాటు వాలీబాల్ పోటీల్లోనూ విజేతగా నిలిచారు. కలకత్తా ఐఐఎంలో డాక్టర్ బీసీరాయల్ అవార్డును అందుకున్నారు. చెన్నైకి భౌతికకాయం: వెంకయ్య మస్తాన్‌బాబు మృతికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మృతదేహాన్ని కేంద్రం చెన్నై విమానాశ్రయానికి పంపుతుందన్నారు. అక్కడి నుంచి అతడి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. మస్తాన్‌బాబు మృతి వార్త తెలిసిన వెంటనే వెంకయ్య విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి భౌతికకాయాన్ని తీసుకురావాలని కోరారు. సీఎం చంద్రబాబు, జగన్ సంతాపం మస్తాన్‌బాబు మృతికి సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే మంత్రి నారాయణ కూడా తన సంతాపాన్ని తెలిపారు. అమెరికా తీసుకెళ్తానన్న నాబిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ అంటూ మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నన్ను అమెరికా తీసుకెళతానన్న నా కుమారుడు ఎక్కడున్నాడయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తోంది. నా కుమారుడికి నీ పేరు పెట్టుకున్నందుకు నాకు కడుపుకోత మిగులుస్తావా మస్తాన్‌బాబా అంటూ కసుమూరు మస్తాన్‌స్వామిని తలచుకుంటూ ఆమె విలపించింది. మస్తాన్‌బాబు తల్లిని ఓదార్చిన ఎంపీ, జెడ్పీ చైర్మన్ మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఓదార్చారు. అతడి సోదరి దొరసానమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.