సంగం: గాంధీజనసంఘం కన్నీటి సంద్రమైంది. మస్తాన్‌బాబు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించింది. మస్తాన య్యా.. లేవయ్యా అంటున్న రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. నెలరోజుల పాటు నిరీక్షణ వారి రోదనను ఆపలేకపోయింది. పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం గాంధీజనసంఘంలోని స్వగృహానికి రాత్రి ఏడు గంటలకు చేరింది. అప్పటికే వేలాదిమంది అభిమానులు, బంధువులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. నెలరోజులుగా కుమారుడి కోసం ఎదురుచూసిన ఆ తల్లి రోదనకు అంతే లేకుండాపోయింది. సోదరుడు ఎప్పుడు వస్తాడా అని చూసిన అన్నలకు తీరని గుండె కోత మిగిల్చింది. అర్జెంటీనాలో ప్యాక్ చేసిన ఆ మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు.
పక్కాగా ప్యాక్ చేసిన వాటిని కొయ్యపని వాళ్లతో తొలగించి, మస్తాన్‌బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. హిందూ సంప్రదాయం ప్రకారం మస్తాన్ బాబుకు తెల్లటి పంచె కట్టి, ముఖానికి పసుపు రాసి ఫ్రీజర్‌లో ఉంచారు. అనంతరం మృతదేహంపై జాతీయ జెండాను కప్పారు. జోహార్ మల్లి మస్తాన్‌బాబు అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు తమ ముందే పెరిగి ఉన్నతస్థాయికి ఎదిగిన మస్తాన్‌బాబు విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో గాంధీజనసంగం శోకసంద్రంలో మునిగిపోయింది.
గ్రామానికి చేరిన మంత్రులు,
ఎమ్మెల్యేలు
పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని రాష్ట్ర మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు ఎమ్మెల్యే పోలంరెడ్డి, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, బీద మస్తాన్‌రావు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయ్‌రామిరెడ్డి సందర్శించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గొప్ప సాహసి, దేశభక్తుడ్ని కోల్పోయామన్నారు. మస్తాన్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. వారి వెంట టీడీపీ నేతలు కన్నబాబు, బత్తల హరికృష్ణ , గుళ్లపల్లి శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు దేవసవహాయం, సర్పంచ్ మానికల సుజాత తదితరులు ఉన్నారు.
బరువెక్కిన హృదయంతో నాన్సీ
నెలరోజులుగా తన గురువు, స్నేహితుడ్ని చూడాలని పరితపించిన నాన్సీ మస్తాన్‌బాబు మృతదేహం చూసి తీరని ఆవేదనకు గురైంది. బరువైన హృదయంతో మస్తాన్‌బాబును పలకరించింది. చివరిచూపును తన కెమెరాలో బంధించింది.
మస్తానయ్యా..లేవయ్యా!
Published Sat, Apr 25 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement