
కోరిక కాదన్నారని.. తలలు తెగ్గోశాడు!!
వివాహేతర సంబంధానికి నిరాకరించారని.. తల్లీ కూతుళ్లను అత్యంత కిరాతకంగా నరికి చంపాడో దుర్మార్గుడు. ఏకంగా వాళ్ల తలలను మొండేల నుంచి వేరు చేసి రోడ్డు మీద పారేసి.. చుట్టుపక్కల అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగింది.
తన భర్త చనిపోవడంతో చిన్ని అనే యువతి కొన్నాళ్లుగా తన తల్లి చంద్రమ్మ వద్దే ఉంటోంది. ఆమెపై అదే గ్రామానికి చెందిన అరటికాయల వ్యాపారి శివయ్య కన్ను పడింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ మూడు నెలలుగా ఆమెపై వేధింపులు మొదలుపెట్టాడు. గురువారం తెల్లవారుజామున చంద్రమ్మ ఇంటికి వచ్చిన శివయ్య, ఏకంగా చిన్నిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనవెంట తెచ్చుకున్న కొడవలితో చిన్నిని, ఆమె తల్లి చంద్రమ్మను కూడా నరికి చంపాడు. అంతేకాదు.. ఆ తర్వాత ఏకంగా వాళ్లిద్దరి తలలను శరీరం నుంచి వేరుచేసి రోడ్డుమీద పారేసి అక్కడి నుంచి పారిపోయాడు.