
రాజమహేంద్రవరం రూరల్: సయోధ్య కెళ్లితే ప్రత్యర్థుల దాడిలో రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన పరిమి నందకిశోర్ (34) మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తొర్రేడులో శుక్రవారం రాత్రి 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన పరిమి నందకిశోర్(34) తండ్రి చనిపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం తల్లితో కలిసి రాజమహేంద్రవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నందకిశోర్ తొర్రేడుకు చెందిన చిట్టూరి సుధీర్‌కు స్నేహితుడు. అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి సుధీర్‌తో అతని స్నేహితులతో కలసి తిరుగుతుంటాడు.
ఈ ఏడాది జనవరిలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాముకు వచ్చిన గొడవల నేపథ్యంలో ఉప్పులూరి రాము స్నేహితుడు ఉప్పులూరి బూమేష్ తండ్రి రామకృష్ణ తలపై పరిమి నందకిశోర్ దాడి చేశాడు. ఈ దాడిలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చిట్టూరి సుధీర్, పరిమి నందకిశోర్‌పై రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఇరువురి మధ్య రాజీ అవ్వడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇటీవల కాలంలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాములు మరి కొంతమంది కొంతమూరులో కల్చ రల్ క్లబ్ నిర్వహించేందుకు రూ.15 లక్షల పెట్టుబడితో ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి నష్టం వచ్చిందని సుధీర్, రాముల మధ్య వివాదం నెలకొంది. ఇరువురు మధ్య సయోధ్య కుదుర్చుతానని పరిమి నందకిశోర్, రాజమహేంద్రవరం ఆవ ప్రాంతానికి చెందిన వరుణ్‌కుమార్, మరి కొంతమంది రాజమహేంద్రవరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో మద్యం సేవించి శుక్రవారం రాత్రి తొర్రేడు గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాలు మాట్లాడుకునే సమయంలో మాటామాటా పెరిగి ఉప్పులూరి రాము మరి కొంతమంది పరిమి నందకిశోర్, వరుణ్‌కుమార్ తదితరులపై పదునైన కత్తులతో దాడి చేయబోగా పరుగులు తీశారు. తొర్రేడు సొసైటీ కార్యాలయానికి ఎదురుగా వచ్చేసరికి నందకిశోర్ తలపై, ఒంటిపైన విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పరుగులు తీసిన వరుణ్‌కుమార్ గాయాలపాలు కావడంతో అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సంఘటన స్థలాన్ని అర్బన్ పోలీస్ జిల్లా ఏఎస్పీ(లా అండ్ ఆర్డర్) లతా మాధురి, తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు, రాజానగరం ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చారు. పాతకక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే పరిమి నందకిశోర్ హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ ఫుటేజీ పరిశీలన
తొర్రేడు సొసైటీ కార్యాలయం ఎదురుగా పరిమి నందకిశోర్ హత్యకు గురికావడంతో కార్యాలయం ఆవరణలోని సీసీ ఫుటేజీ హార్డ్‌కాపీ తీసుకుని వెళ్లి ఏఎస్పీ, డీఎస్పీలు పరిశీలిస్తున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో సరిగా కనిపించడం లేదు. వరుణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు రాజానగరం ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా...
మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా అని చెప్పిన తమ్ముడు ఇలా మృత్యువాత పడతాడని అనుకోలేదని పరిమి నందకిషోర్ అక్క విజయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అమ్మా ఉమాదేవి, తమ్ముడు ఇద్దరూ కలిసి ఉంటారని, ఇప్పుడు అమ్మకు పుత్రశోకం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. తొర్రేడులో నందకిషోర్ నిర్జీవంగా పడి ఉండడాన్ని అతని తల్లి ఉమాదేవి తట్టుకోలేక పోయింది. తన కుమారుడును ఈ విధంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment