మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి జీపు నుంచి దూకి మరణించాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎస్.ఐ.మూర్తి కథనం మేరకు.. బందరు మండలం గరాలదిబ్బకు చెందిన ఒడుగు ఏసు, అతడి సోదరుడు రాముడు (38) తాగిన మైకంలో తల్లి నాగేశ్వరమ్మను వేధిస్తుండేవారు. వీరి వేధింపులు భరించలేక ఆమె సంక్రాంతి పండుగకు ముందు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల కిందట ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి రాముడు, ఏసులను స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు పరారయ్యారు.
సోమవారం తాలుకా ఎస్.ఐ.ఉమామహేశ్వరరావు గరాలదిబ్బ గ్రామానికి వెళ్లి రాముడు, ఏసులను తన జీపులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకువెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న జీపు బందరుకోటలోని మత్స్యశాఖ కార్యాలయం సమీపానికి వచ్చేసరికి పశువులు అడ్డువచ్చాయి. బ్రేక్ వేసి తిరిగి జీపు వేగం పుంజుకునే సమయంలో రాముడు హఠాత్తుగా కిందకు దూకాడు. తీవ్రగాయాలైన అతడిని హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీస్ జీపు నుంచి దూకి వ్యక్తి మృతి
Published Mon, Jan 25 2016 7:40 PM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement