భర్త కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భారతి, ఆమె కుటుంబ సభ్యులు, (అంతరచిత్రం) గల్లంతైన బుచ్చి మహేశ్వరరావు
ఓ పక్క గోదావరి వరద ప్రమాదకరంగా ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరిలో బోట్లు, పడవల రాకపోకలను నిషేధించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. లంక గ్రామాలకు రాకపోకలకు మరో దారి లేకపోవడంతో నాటు పడవలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ముమ్మిడవరం మండలం గురజాపులంక గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడడంతో ఒక యువకుడు గల్లంతు అయ్యాయి. అందులో ఉన్న 14 మంది ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలను దక్కించుకున్నారు.
తూర్పుగోదావరి ,ముమ్మిడివరం: ఉదయమే పొలం నుంచి పాలకేన్లతో ఇంటికి చేరుకునే రైతులతో కళకళలాడే ఆ లంక గ్రామాలు సోమవారం శోకసంద్రంగా మారాయి. గౌతమి గోదావరి పాయలో పడవ బోల్తా పడడంతో గురజాపులంక గోదావరి తీరం ఆక్రందనలతో మార్మోగింది. మండలంలోని కమిని శివారు గురజాపులంక గోదావరి పాయలో నాటు పడవ పెనుగాలులకు అదుపు తప్పి ఒడ్డున ఉన్న తాడి చెట్టును ఢీకొని బోల్తా పడడంతో ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. అందులో ఉన్న 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
పాల కేన్లతో పడవ ఎక్కారు
లంకాఫ్ ఠానేల్లంక శివారు కూనాలంకకు చెందిన 15 మంది రైతులు గౌతమి గోదావరి పాయ మధ్య ఉన్న దుప్పిలంకలోని వారి పొలాల్లో ఉన్న పశువుల నుంచి పాలు తీసుకుని నాటు పడవ ఎక్కారు. పడవ ఒడ్డుకు చేరే సమయంలో ఈదురుగాలులకు పడవ అదుపు తప్పి ఒడ్డున ఉన్న తాడి చెట్టును ఢీకొని బోల్తా పడింది. పడవలో ఉన్న నల్లా బుచ్చి మహేశ్వరరావు (26) గల్లంతయ్యాడు. ఒక పక్క ఈదురు గాలులు, గోదావరి ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నా పడవ బోల్తా పడిన వెంటనే ప్రవాహ వేగానికి ఎదురీదుకుంటూ కొందరు ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు ఒడ్డున ఉన్న ముళ్ల కంచెలు పట్టుకుని బయటపడ్డారు. లేనిపక్షంలో పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అమలాపురం ఆర్డీఓ డి.వెంకటరమణ, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నా బిడ్డ ఏమైపోయాడో..
పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే బిడ్డ ఉదయం పాలు తీసుకువస్తానని వెళ్లి ఏమైపోయాడోనని గల్లంతైన బుచ్చి మహేశ్వరరావు తల్లిదండ్రులు బాలరాజు, వరలక్ష్మి బోరున విలపిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ కుమారుడు పడవ ప్రమాదంలో గల్లంతైన విషయం తెలిసి ఆ కుటుంబ సభ్యుల రోదిస్తుంటే చూపరులను కలచివేసింది.
శోక సంద్రంలో నిండు గర్భిణి
గల్లంతైన మహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన భారతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు నిండు గర్భిణి. ఈ నెల 30న ప్రసవం అవుతుందని వైద్యులు తెలిపారు. పుట్టింటిలో ఉన్న ఆమెకు.. గోదావరిలో భర్త గల్లంతైన విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిచింది. మరో పది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చే ఆమె భర్త గల్లంతు కావడంపై ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
బెండకాయల మూటే రక్షించింది
ప్రమాదం జరిగిన పడవలో ఉన్న బెండకాయల మూటే రక్షించింది. పడవ బోల్తా పడటంతో నీట మునిగాను. కంగారుతో ఒంట్లో దడ ప్రారంభమైంది. కాళ్లూ చేతులు ఆడలేదు. మునిగిపోతాననుకున్నాను. నీటిపై తేలుతున్న బెండకాయల మూట కనిపించింది. దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాను.– నల్లా విష్ణుమూర్తి, ప్రమాదం నుంచి బయట పడ్డ రైతు
Comments
Please login to add a commentAdd a comment