పెళ్లి పేరుతో మోసం..
Published Sat, Mar 11 2017 10:54 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
గాజువాక: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఆమె గర్భం దాల్చడంతో తనకు సంబంధం లేదంటూ మొహం చాటేశాడు. యువకుడితో తనకు వివాహం చేయాలని అటు పోలీసులు, ఇటు పెద్దల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. బాధితురాలికి న్యాయం చేయాలని తమ ప్రతినిధులతో కలిసి పద్మ గాజువాక పోలీస్ స్టేషన్వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. దిగొచ్చిన పోలీసులు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగ్లాం గ్రామానికి చెందిన యువతితో ఆమె బంధువు గొలగాని శ్రీనివాస్‌కు వివాహం చేయాలని పెద్దలు ప్రతిపాదన చేశారు. పెళ్లి మాటలు కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 20న శ్రీనివాస్ తుంగ్లాంలోని యువతి ఇంటికి వచ్చాడు. తన తల్లిదండ్రులు పనికి వెళ్లిపోయారని ఆమె చెప్పినప్పటికీ ఇంట్లోకి వెళ్లాడు. కొద్దిసేపు మాటల తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఆ యువతి చేయి పట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత భయమెందుకంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు.
అనంతరం తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. తనను పెళ్లి చేసుకోలేనని ఆ యువతికి షాకిచ్చాడు. మరుసటి నెలలోనే ఆమె గర్భం దాల్చిన విషయం తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనికి శ్రీనివాస్ తల్లిదండ్రులు ససేమిరా అనడంతో తొలుత గాజువాక పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పిలిచి మాట్లాడతామని చెప్పిన పోలీసులు.. రోజులు గడిచే కొద్దీ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో కొందరు పెద్దలను కలిసి న్యాయం చేయాలని కోరారు.
యువతికి గర్భస్రావం చేయించాలని వారు నిర్ణయించారు. ఆసుపత్రికి వెళ్లిన అనంతరం అబార్షన్‌కు డాక్టర్ అంగీకరించకపోగా కేసు పెడతానని హెచ్చరించి పంపేశారు. పెళ్లికి అంగీకరించబోమంటూ నిందితుడి తల్లిదండ్రులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేయడంతో బాధితురాలు మహిళా చేతన ప్రతినిధులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆందోళనతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Advertisement