చీరాలటౌన్, న్యూస్‌లైన్ : జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హతమార్చి ఆపై తానూ ఉరేసుకుని తనువు చాలించాడు. కుటుంబంలో నెలకొన్న చిన్న వివాదాలే చినికి చినికి గాలివానలా మారి భార్య హత్య, భర్త ఆత్మహత్యకు దారి తీసింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని తోటవారిపాలెంలో శనివారం రాత్రి జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రూరల్ సీఐ ఎండీ ఫిరోజ్ కథనం ప్రకారం.. తోటవారిపాలెం పంచాయతీ కార్యాలయం పక్కనే రావిపాటి కృష్ణ(50), కృష్ణకుమారి(45) దంపతులు నివశిస్తున్నారు. ఇంతకాలం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. వివాహమై 28 ఏళ్లుకాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు డిఫెన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఐదేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా ఘర్షణ పడ్డారు. ఆగ్రహానికి గురైన భర్త తన భార్య కృష్ణకుమారిని హత్యచేసి ఆపై తానూ ఉరేసుకొని తనువుచాలించాడు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్గంధం వెదజల్లుతుండటంతో చుట్టుపక్కల వారు గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. మంచంలో భార్య మృతదేహం, దూలానికి వేలాడుతూ భర్త మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ ఫిరోజ్, ఎస్సై రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల అల్లుడు శివసుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి, ఆత్మహత్య కేసులుగా నమోదు చేశారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో తోటవారి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు.
భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త
Published Mon, Sep 30 2013 3:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement