వారి భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్‌ | Mana Palana Mee Suchana : YS Jagan Review On Education Sector | Sakshi
Sakshi News home page

అది పిల్లల భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్‌

Published Wed, May 27 2020 12:39 PM | Last Updated on Wed, May 27 2020 1:34 PM

Mana Palana Mee Suchana : YS Jagan Review On Education Sector - Sakshi

సాక్షి, తాడేపల్లి : అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు.. మన పిల్లల భవిష్యత్‌ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లిషు మీడియం వద్దనే పెద్ద మనుషులు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘నా పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పిల్లలకు నవంబర్‌ నాటికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి. స్కూల్‌ బిల్డింగ్‌లు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి ఉన్న ఎవ్వరూ పట్టించుకోలేదు. స్కూళ్లల్లో బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వృథా అనే పరిస్థితి ఉండేది. అందుకే ఖర్చు ఎక్కువైనా పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లల్లో చేర్పించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతీది ఇంగ్లిష్‌ మీడియంలోనే ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై.. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. మన పిల్లల భవిష్యత్‌ కోసం ఇది నేను పెడుతున్న పెట్టుబడి.

సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం..
బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే కళాశాలల్లో చేరే విద్యార్థుల నిష్పత్తిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. చదివించే స్థోమత లేకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను ఆపేస్తున్నారు.. పాదయాత్రలో పిల్లలను చదివించలేక ఇబ్బందిపడుతున్న చాలా మంది తల్లిదండ్రులను కలిశా. చదువు కోసం తండ్రి అప్పులపాలు కాకూడదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాల్‌ అనే వ్యక్తి పాదయాత్రలో నాతో చెప్పారు. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కారం చదువు మాత్రమే. అందుకే విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. విద్యారంగంలో మార్పుల్లో భాగంగానే ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చాం. ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లనే కొందరు పెద్ద మనుషులు విచిత్రమైన వాదనను తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దనే పెద్దమనుషులు మాత్రం...తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. అయినా సడలని పట్టుదలతో ఇంగ్లిష్‌ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే.. అందులో 96శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం.

పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నాం. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలున్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్‌, టాయిలెట్లు ఉండాలి. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే అమ్మఒడి తీసుకొచ్చాం. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించాం. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశాం. 

పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక..
ఏవైనా కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లిష్‌ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడే పరిస్థితి రావాలి. కోవిడ్‌ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తాం. జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, బుక్స్‌, షూలు, బెల్ట్‌, బ్యాగ్‌ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాం. సరుకుల బిల్లులతోపాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూ రూపొందించాం’ అని తెలిపారు.

చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం
ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ ఉండాలని నిర్ణయించాం. 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టింది. గత ప్రభుత్వ బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన... ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.4200 కోట్లను ఇప్పటికే చెల్లించాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బులను.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తాం. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు వసతి దీవెన కింద రెండు దఫాల్లో రూ.20వేలు ఇస్తాం. కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసి.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కోసం ఇద్దరు రిటైర్డ్‌ జడ్జిలను నియమించాం. పాఠశాలలు, కాలేజీలు తమ సదుపాయాలను వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉంటుంది’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement