కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కళాశాల స్టూడెంట్స్ మేనేజ్‌మెంట్ వసతిగృహాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెస్‌చార్జీల విడుదలలో అశ్రద్ధ కారణంగా విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇదే సమయంలో సొంత డబ్బు ఖర్చు చేస్తున్న వార్డెన్లు అప్పులపాలవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నయాపైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలవుతున్న నేపథ్యంలో ఆయా వర్గాల సంక్షేమ వసతి గృహాలకు మంచి రోజులు వచ్చినట్లేనని అందరూ భావించినా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. మౌలిక సదుపాయాలు దేవుడెరుగు.. కనీసం మూడు పూటల బువ్వ కూడా కష్టమవుతోంది.
జిల్లాలో సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలోని 21 వసతి గృహాల్లో ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ, ఇతర టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దాదాపు 1625 మంది ఉన్నారు. వీరిలో 795 మంది బాలురు కాగా 830 మంది బాలికలు. విద్యార్థులకు సంబంధించి ప్రతినెలా పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం మాత్రమే సరఫరా అవుతోంది. మిగిలిన పప్పు, ఉప్పు, కూరగాయలు, నూనె తదితర నిత్యావసర సరుకులను బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు విడుదల చేస్తున్న మెస్ చార్జీలను పోగేసి ఈ సరుకులను కొనుగోలు చేస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి నెలకు మెస్‌చార్జీల కింద రూ.1050 చెల్లించాలి. అయితే గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.1.36 కోట్ల విడుదలలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
రెన్యూవల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు కొంత విడుదలైనా, ఉపకార వేతనాలకు ఆధార్ లింకు పెట్టడంతో సమస్య తలెత్తుతోంది. స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్ విద్యార్థులు కూడా ఇదే కోవలోకి వస్తుండడంతో మెస్‌చార్జీల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్‌మెంట్ హాస్టల్స్‌లోని విద్యార్థులకు ఆధార్‌తో లింకు లేకుండా డిపార్ట్‌మెంట్ అటాచ్‌మెంట్ హాస్టల్(డీఏహెచ్) సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినా.. ఆచరణలో మాత్రం మరచినట్లు కనిపిస్తోంది.
అప్పుల్లో కొత్త వార్డెన్లు
జిల్లాలో మొత్తం 21 స్టూడెంట్ మేనేజ్‌మెంట్ వసతిగృహాలు ఉండగా, ఏడు వసతి గృహాలకు గత ఏడాది కొత్త వార్డెన్లను నియమించారు. వీరంతా విధిలేని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ఇప్పటికే ఒక్కో వార్డెన్‌కు కిరాణా బకాయిలు రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌ను విడుదల చేస్తుందనే భావనతో ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు లక్షల్లో అప్పు చేసి హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. అయితే ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో వీరంతా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు
అప్పుచేసి పప్పుకూడు
Published Mon, Jan 20 2014 5:03 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement
Advertisement