
విద్యార్థి చెయ్యిపై వాతలు
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్ స్కూల్ ఓ విద్యార్థి్థని ప్రిన్సిపాల్ చితకబాదారు. విద్యార్థి తండ్రి వివరాల మేరకు..నాగపుల్లయ్య కుమారుడు దేవేంద్ర మోడల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఎవరో విద్యార్థి తరగతి గదిలోని డెస్కులపై బురదకాళ్లతో తొక్కారు. ఈ విషయం ప్రిన్సిపాల్ హుసేన్‌వలికి తెలియటంతో ఎలాంటి విచారణ చేయకుండా దేవేంద్రను కర్రతో వీపు, చెయ్యి, కాళ్లపై చితకబాదారు.
విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల వద్దకు వెళ్లి కుమారుడిని తీసుకుని గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన నోడల్ అధికారి వెంకటరమణయ్య, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ శివరాముడుకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయకపోయినా విద్యార్థుల మాట విని ప్రిన్సిపాల్ తనను చితకబాదాడని విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రిన్సిపాల్‌ను పిలిపించి మందలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థి తండ్రి శాంతించాడు. విద్యార్థి అల్లరి చేయటంతో కాస్త మందలించినట్లు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.