అణచివేత ధోరణికి ఇదే పరాకాష్ట
► ప్రభుత్వంపై మంద కృష్ణమాదిగ మండిపాటు
► ఉదయం 11వరకు రాయచోటిలోనే ఉంచిన వైనం
రాయచోటి రూరల్: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న అణచివేత ధోరణికి ఇది పరాకాష్ట అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. ఆదివారం సమావేశాలు జరగనీయకుండా అడ్డుకున్నారని సోమవారం రాయచోటిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జూలై 7న ఎమ్మార్పీఎస్ 23వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం అమరావతిలో భారీగా కురుక్షేత్రం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎమ్మార్పీఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంద కృష్ణమాదిగ ప్రతి జిల్లాకు రెండు ప్రాంతాల్లో మినీ కురుక్షేత్రం పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సమావేశం ముగించుకుని, అదే జిల్లాలోని పుంగనూరులో మారో సమావేశం నిర్వహించేందుకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మందకృష్ణమాదిగను ఆదివారం సాయంత్రం 3గంటలకు అదుపులోకి తీసుకున్నారని, ఆ తరువాత అక్కడ మాదిగల ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో సరిహద్దు దగ్గరగా ఉన్న రాయచోటికి మంద కృష్ణమాదిగను తరలించి, ఇక్కడి పోలీసులకు రాత్రి 9:30 ప్రాంతంలో అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత సోమవారం ఉదయం 10గంటల వరకు రాయచోటిలోని భానుహరి రెసిడెన్సీలో రాయచోటి అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌బాబుల బందోబస్తులో మందకృష్ణమాదిగ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సభలు, సమావేశాలు కూడా నిర్వహించే స్వేచ్ఛ లేదంటూ చంద్రబాబు నియంతృత్వానికి ఇదే పరాకాష్ట అని పేర్కొన్నారు. అణిచివేసినంత మాత్రాన ఉద్యమాలు, సభలు, సమావేశాలు ఆగవని ఆయన హెచ్చరించారు.
గతంలో తెలంగాణలో చంద్రబాబును అడ్డుకున్న సమయంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవరూ అడ్డుకునేందుకు వీలులేదని, చంద్రబాబు పర్యటన సాగాలని పోరాడి, ఆయనకు మద్దతు ఇస్తే, ఇప్పుడు ఆయన సొంత జిల్లాలోనే అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై ఎమ్మార్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన ఉదయం 11గంటల సమయంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు.