‘చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా..’
విజయవాడ: మాదిగలకు పెద్దకొడుకుగా ఉంటానన్న చంద్రబాబు మాదిగలకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై బెజవాడ కనకదుర్గమ్మను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాదిగల కోసం ఏం చేశారో దుర్గమ్మ సన్నిధిలో బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మాదిగల ఉద్యమాన్ని అణచివేయడం సిగ్గుచేటన్నారు. వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని జిల్లాల్లో పర్యటిస్తుంటే అక్రమ అరెస్ట్‌లకు పాల్పడటం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 23 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమని వాపోయారు. చంద్రబాబుకు ఓట్లు వేసింది కాపులు, దళితులేనని అన్నారు.
‘మా ఓట్లతో గెలిచి అటు ముద్రగడ పాదయాత్రను, ఇటు మా పర్యటనను బాబు అడ్డుకుంటున్నారు. ఆయనను ఓడించడానికి కృషిచేసిన వారికేమో పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. గెలిపించినవారిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా దేవాలయాల యాత్ర పేరుతో పర్యటిస్తున్నా పోలీసులు నిఘా పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోంద’ని మండిపడ్డారు. జూలై 7న అమరావతిలో తలపెట్టిన కురుక్షేత్ర సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా నిర్వహించి తీరుతామని మందకృష్ణ స్పష్టం చేశారు.