కెటిఆర్
సిరిసిల్ల: యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరిగా ఇవ్వవలసిన అనివార్య పరిస్థితి ఎదురైందని సిరిసిల్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు(కెటిఆర్) అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందంటే తనకిప్పటికీ నమ్మకం కలగడం లేదన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు పాసయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని నమ్మేది లేదని ఆయన స్పష్టం చేశారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణపై యూటర్న్ తీసుకున్నారని, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఏకంగా అధిష్టానంపైనే తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం అరవై ఏళ్ల పోరాటం కంటే, సీమాంధ్రుల ఆరు రోజుల లొల్లి ఎక్కువైందన్నారు. ఏ టీవీ చానల్ చూసినా జై సమైక్రాంధ్ర అంటూ టైర్లు కాలుతున్న దశ్యాలు, టెంట్ కూలిన అంశాలే చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.