‘మన్నవరం ఎన్‌బీపీపీఎల్‌ను తరలించడం లేదు’ | mannavaram BHEL project not shifting says minister in Rajya sabha | Sakshi
Sakshi News home page

‘మన్నవరం ఎన్‌బీపీపీఎల్‌ను తరలించడం లేదు’

Published Thu, Feb 7 2019 5:03 PM | Last Updated on Thu, Feb 7 2019 5:03 PM

mannavaram BHEL project not shifting says minister in Rajya sabha  - Sakshi

న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో గురువారం రాజ్య సభలో ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రెండు దశల్లో 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని 2010లో ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తొలి దశ కింద 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈపీసీ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లను చేపట్టడంతోపాటు కోల్‌ హ్యాండ్లింగ్‌, యాష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే పరికరాల తయారీని చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే రెండో దశ కింద 4,800 కోట్ల రూపాయల పెట్టుబడులతో బాయిలర్‌, టర్బైన్‌, జెనరేటర్ల (బీటీజీ) తయారీ యూనిట్లను నెలకొల్పాలని ప్రతిపాదించినట్టు తెలిపారు.

మార్చి 2011లో జరిగిన ఎన్‌బీపీపీఎల్‌ బోర్డు సమావేశంలో దేశంలో నెలకొన్న వ్యాపార అవకాశాలపై సమీక్ష జరిగింది. అప్పటికే దేశంలో బీటీజీ ఎక్విప్‌మెంట్‌ తయారీ రంగంలోకి అనేక జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు ప్రవేశించడంతో తీవ్రపోటీ నెలకొన్నట్లు సమీక్షలో గుర్తించిన యాజమాన్యం తమ వ్యాపార కార్యకలాపాలను తొలిదశకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి తోడు 2011-12 మధ్య కాలంలో దేశీయ పవర్‌ రంగంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆర్డర్ల సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఎన్‌బీపీపీఎల్‌ తొలి దశ పెట్టుబడులపై తిరిగి దృష్టి సారించవలసిన అవసరం ఏర్పడింది. 2015లో రూపొందించిన ఫీజబులిటీ నివేదిక ప్రకారం తొలి దశలో 363.94 కోట్లు మాత్రమే పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఎన్‌బీపీపీఎల్‌లో 2018 డిసెంబర్‌ చివరి నాటికి 130 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు మంత్రి చెప్పారు. ఇందులో 100 కోట్లు ప్రమోటర్‌ కంపెనీలైన ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ సమకూర్చాయి. ఎన్‌బీపీపీఎల్‌లో వాణిజ్యపరమైన కార్యకలాపాలు 2015 మేలో ప్రారంభమైనట్లు మంత్రి తన జవాబులో పేర్కొన్నారు.

వర్శిటీల్లో ప్రొఫెసర్ల నియామకం వాయిదా
సెంట్రల్‌ యూనివర్శిటీలతోపాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ పొందుతున్న అన్ని రాష్ట్ర యూనివర్శిటీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు, యూజీసీ ఇంటర్‌-యూనివర్శిటీ సెంటర్లలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నియామక ప్రక్రియను వాయిదా వేయవలసిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గత ఏడాది జూలైలో ఆదేశాలు ఇచ్చినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సత్యపాల్‌ సింగ్‌ వెల్లడించారు. యూజీసీ ఆదేశాలను అతిక్రమిస్తూ రోస్టర్‌ పాయింట్లపై స్పష్టత రాకుండానే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు యథేచ్చగా సాగిపోతున్న విషయం వాస్తవమేనా అంటూ గురువారం రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటి అవకతవకలేవీ తమ దృష్టికి రాలేదని యూజీసీ తెలియచేసిందని చెప్పారు.


విశాఖ స్మార్ట్‌ సిటీకి నిధుల కొరత లేదు
తొలి రౌండ్‌లోనే స్మార్ట్‌ సిటీగా ఎంపికైన విశాఖపట్నం నగరంలో 1,602 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 28 ప్రాజెక్ట్‌లు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటి వరకు 196 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగినట్లు నగరాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. రాజ్య సభలో గురువారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2016లో తొలి రౌండ్‌లోనే విశాఖపట్నం స్మార్ట్‌ సిటీల జాబితాలో చోటు సంపాదించున్నట్లు తెలిపారు. 2016-17లో విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద తొలి విడత వాయిదా కింద 196 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. రెండో వాయిదా కోసం ఎలాంటి విజ్ఞప్తి రానందున 2017-18లో నిధుల విడుదల జరగలేదు. 2018-19లో తొలి విడత నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అందిన తర్వాత రెండో వాయిదా కింద 98 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ 2020-21 నాటికి పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement