అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని కడ్పల్‌లో చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..
కల్హేర్, న్యూస్‌లైన్ : అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని కడ్పల్‌లో చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి విఠల్ (35) శుక్రవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామ శివారులోని ఓ వరి పొలంలో విఠల్ శవమై కనిపించాడు.
విషయాన్ని స్థానికులు భార్య సిద్దమ్మ, కుటుంబీకులకు చెప్పగా వారు అక్కడికి వెళ్లి విలపించారు. అయితే విఠల్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో హత్య చేసి వరి పొలంలో పడేశారని ఆరోపించారు. సిర్గాపూర్ ఎస్‌ఐ కోటేశ్వరరావ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో అనుమానాలు తేటతెల్లం అవుతాయని తెలిపారు. మృతుడి భార్య సిద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.