
నెల్లూరులోనూ బురిడీబాబా లీలలు
► పలువురిని మోసగించిన వైనం
► పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోన్న బాధితులు
► ఆరా తీస్తున్న పోలీసులు
నెల్లూరు (క్రైమ్) : లక్ష్మీపూజల పేరిట డబ్బులు రెట్టింపు చేస్తామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెండ్‌గా మారిన బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి మోసాలు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. 2014లో జూన్ 8వ తేదీన మాగుంట లేఅవుట్‌లోని పావని అపార్ట్‌మెంట్‌లో ఆనందరెడ్డి ఇంట్లో రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై అప్పట్లో నెల్లూరు నాల్గోనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడి కోసం నెల్లూరు, తిరుపతి పోలీసులు విసృ్తత గాలిస్తుండగా అదే ఏడాది ఆగస్టు 22వ తేదీన అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి కరకంబాడి వద్ద బురిడీబాబాను, అతని అనుచరుడు దామోదర్‌ను అరెస్ట్ చేసి రూ.80 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని జైలుకు పంపారు. అప్పటి నుంచి అతను కొంతకాలం కనుమరుగయ్యారు. తాజాగా హైదారాబాద్‌కు చెందిన లైఫ్‌స్టైల్ అధినేత మధుసూదన్‌రెడ్డిని సుమారు రూ. 1.30 కోట్లు బురిడీకొట్టించడంతో అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం శివను బెంగళూరులో అరెస్ట్ చేశారు.
జిల్లాలో అనేక మోసాలు
బురిడీ బాబా శివకు నెల్లూరు జిల్లాలోని పలువురుతో భారీ పరిచయాలు ఉన్నాయి. వారి ఆధారంగా సంపన్న వర్గాలకు చెందిన పలువురుని పూజల పేరిట మోసగించినట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ను పూజల పేరిట రూ. 80 లక్షల వరకు మోసగించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇటీవల పూజల పేరిట రూ. 40 గ్రాముల బంగారు, రూ. 40 వేల నగదుతో పూజారి ఉడాయించిన సంఘటనపై ఒకటో నగర పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసులు బురిడీబాబా మోసాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.