
సాక్షి, తిరుపతి : తమిళనాడులో పట్టుబడ్డ కోట్ల రూపాయలు విలువ చేసే టీటీడీ బంగారం భాగోతం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పట్టుబడ్డ బంగారానికి సంబంధించి టీటీడీ ఇంతవరకు నోరు మెదపకపోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. కమలానంద భారతీ స్వామిజీ ఆదివారం టీటీడీ ఈఓ, జేఈఓపై చేసిన ఘాటు విమర్శలు కూడా అనుమానాలను బలపరుస్తున్నాయి. తమిళనాడులో పట్టుబడ్డ బంగారం టీటీడీదా? ఎవరైనా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని బంగారాన్ని సక్రమం చేశారా? అన్నది ఇప్పుడు తిరుమల, తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో ఎన్నికల ముందు రోజు అంటే బుధవారం రాత్రి రూ.400 కోట్లకు పైగా విలువచేసే 1,381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ బంగారం టీటీడీకి చెందినదని ప్రకటించారు. అన్ని కోట్లు విలువచేసే బంగారం తరలించే సమయంలో ఎటువంటి భద్రత లేకుండా తీసుకురావటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా.. కమలానంద భారతీ స్వామిజీ సైతం బంగారంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ టీటీడీ ఈఓ, జేఈఓపై ఘాటు విమర్శలు చేశారు. ఆ బంగారం నిజంగా టీటీడీదే అయితే.. ఆ పెట్టెలపై టీటీడీ, బ్యాంకు సీలు ఎందుకు లేదని.. విదేశీ సీలు ఎందుకు ఉందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
హడావిడిగా ట్రెజరీకి తరలింపు
కాగా, పట్టుబడ్డ బంగారం శనివారం రాత్రి తిరుపతి ట్రెజరీకి చేరింది. ఈ విషయంలోనూ ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా తిరుపతిలోని టీటీడీ ట్రెజరీకి తరలించారు. మరోవైపు.. ఒకవేళ ఆ బంగారం పట్టుబడకుండా ఉంటే అదంతా నిజంగా టీటీడీకి చేరేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. గతంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శేఖర్‌రెడ్డి వద్ద భారీ నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అటువంటి బడా బాబులు ఎవరైనా విదేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకొస్తుండగా పట్టుబడితే.. టీటీడీ బంగారం అని చెప్పారా? అని అనుమానిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని టీటీడీ పేరు చెప్పి సక్రమం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.
నిజానికి తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను, నగదును జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయటంపై గతంలోనే ఆరోపణలొచ్చాయి. ఇదిలా ఉంటే.. కమలానంద భారతీ స్వామీజీ టీటీడీ ఈఓ, జేఈఓలపై ఘాటైన విమర్శలు చేయడంతో ఆయనకు కొందరు టీటీడీ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో టీటీడీ ఈఓ, జేఈఓలను తప్పుబట్టటంలేదని ఆయన అరగంటలోనే మాట మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనంతటి కథ వెనుక అసలు నిజాలను బయటపెట్టాలని టీటీడీ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment