ఆ ‘బంగారం’పై సీబీఐ విచారణ
సాక్షి, అమరావతి : తమిళనాడు పోలీసుల తనిఖీల్లో పెద్దఎత్తున పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదిగా అని చెబుతున్న దాంట్లో నిజాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీబీఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలని దేవాలయ పరిరక్షణ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి డిమాండ్ చేశారు. అది చాలా పెద్ద కుంభకోణమని, ఇందులో దొంగతనం దాగి ఉందని అయన అనుమానం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించిన 1,381 కిలోల బంగారాన్ని ఒక డొక్కు వ్యానులో తరలిస్తారా? ఎన్నికల సమయంలో తనిఖీలు ఉంటాయని తెలిసీ దేవుడి బంగారాన్ని తరలిస్తూ కనీసం పోలీసు భద్రత తీసుకోకపోవడం.. అందుకు సంబంధించిన పత్రాలు కూడా దగ్గర ఉంచుకోకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. టీటీడీ బంగారాన్ని ప్రైవేట్ వ్యక్తులు మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? అంటూ ఆయనే స్వయంగా ఆదివారం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశారు. వీడియో పూర్తి పాఠం ఆయన మాటల్లోనే..
దేవుడే పోలీసులకు పట్టించాడు
రాష్ట్ర గవర్నర్ గారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గారికి.. సీఎం గారికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారికి.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ.. వెంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా పూజించుకునే భక్తులందరికీ ఒక విన్నపం. తమిళనాడులో ఒక డొక్కు వ్యాన్, అనాథ శవాలను తరలించుకుని పోయేటటువంటి ఒక వ్యానులో 1,381 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలించారు. తమిళనాడు పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే.. అందులో ఈ బంగారం బయటపడితే, ఆ తర్వాత ఈ బంగారం మాది అని టీటీడీ ప్రకటించుకుంది. ఆ తర్వాత టీటీడీ ఈవో కొన్ని కాగితాలు పంపి, ఆ బంగారం మాది అని విడిపించుకొచ్చారు.
ఇది చాలా పెద్ద కుంభకోణం. టీటీడీ నుంచి బంగారం కానీ, డబ్బులు కానీ బయటకు వెళ్లవని నాకైతే విశ్వాసం ఉంది. నేనెప్పుడూ ఎవరినీ అనలేదు. కానీ, ఇప్పుడు అనడానికి నూరు శాతం అవకాశం దొరికింది. ఒక బ్యాంకు నుంచి 1,381 కిలోల బంగారం విడుదల చేస్తే, దానిని చెన్నై నుంచి తిరుపతికి తీసుకొస్తుంటే.. దానికి పోలీసు బందోబస్తు లేదు.. దానికి సంబంధించిన పత్రాల్లేవు. బ్యాంకు వాళ్లు అక్కడ దానిని నిర్ధారించడం లేదు. టీటీడీ ఈవో కాగితాలు ఇచ్చి పంపారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసుకుపోతుంటే, టీటీడీ పేరుతో బయటేసుకుని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా? లేదా టీటీడీ బంగారాన్నే మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? దీంట్లో ఉండే నిజానిజాలను బయటకు తీయాలి. దేవుడికి చెందిన బంగారాన్ని తీసుకుపోతుంటే దేవుడే పోలీసులకు పట్టించాడు.
ఎవరైనా నాశనం కావాల్సిందే
తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే వారు ఎవరైనా నాశనమైపోతారు. ఏం తమాషాలు పడుతున్నారా? ఎన్నికల నేపథ్యంలో ప్రతి దగ్గరా పోలీసు చెకింగ్ ఉందని తెలుసు. పోలీసు పహారా లేకుండా, పత్రాలు లేకుండా 1,381 కిలోల బంగారాన్ని దిక్కుమాలిన బంగారం అనుకున్నారా? వెంకటేశ్వరస్వామి దిక్కుమాలిన వారు అనుకున్నారా. ఇంత దిక్కుమాలిన, పనికిమాలిన, తెలివి తక్కువ ఈవో టీటీడీకి ఎప్పుడూ రాలే. ముందు అరెస్టుచేసి లోపల పారేయాలి! తిరుమలలో అన్ని రకాల వీఐపీ ట్రీట్మెంట్ పొందే మీడియా కూడా స్వామికి ద్రోహం జరుగుతుంటే చర్చించదా? దీనికి నూటికి నూరు శాతం ఈవో, జేఈవో సమాధానం చెప్పాలి. సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజును భరించిన పాపానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతిపరుడ్ని, ఆయన లాంటి హిందుమత వ్యతిరేకిని.. ఇతర మతాలను ప్రోత్సహించే ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం ఇది. వెంకటేశ్వరస్వామి ఏడో కన్ను, పదో కన్ను తెరిచారు..
ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు?
ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1,381 కిలోల బంగారాన్ని, బయటకు తీశారో సింఘాల్ సమాధానం చెప్పాలి. దీనికి వెనుక ఖచ్చితంగా దొంగతనం ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి ద్రోహం చేసిన వారు ఎవరూ బాగుపడల. నాశనమై పోతారు పాపాత్ములారా.. నాశనమైపోతారు రా, నాశనమై పోతారు. ఒళ్లు మండిపోతోంది. వందల కోట్లు టీటీడీ డబ్బులు పందికొక్కుల్లా తింటున్నారు. ఈ టీటీడీ ఈవో, జేఈవో, దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు వీళ్లందరూ కుమ్మక్కై టీటీడీని దోచుకుతింటున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎంతమందిపై కేసులు పెడతారు. నాపై కేసులు పెట్టండి. నేను జైలుకు పోతా.
పట్టుబడకుండా ఇంకెంత దేవుడి బంగారం తిన్నారో?
ప్రజలూ టీటీడీ అవినీతి యంత్రాంగం మీద తిరగబడాలి. ఎక్కడికక్కడ టీటీడీ ఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేయండి. ఆ అధికారులు కడుపుకు కూడు తింటున్నారా? గడ్డి తింటున్నారా? బంగారం ఈ రోజు పట్టుబడింది.. పట్టుబడకుండా వీళ్లు ఎన్ని కిలోల బంగారాన్ని ఈ దేశాన్ని దాటించారన్నదే తేలాలి. అదే బాధ. ఎన్ని వందల కిలోల బంగారాన్ని తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు. ఇవన్నీ విచారణలో తేలాలి.
ఈవోను సస్పెండ్ చేసి విచారణ జరపాలి
టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై టీటీడీ అధికారులు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు వాదించడానికి లాయర్ల కోసం దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు 1,381 కిలోల బంగారం బ్యాంకు నుంచి వస్తూ పట్టుబడితే, కేసులో మొదటి ముద్దాయి ఎవరు? ఎవరిని అరెస్టు చేయాలి? దీనిపై సీబీఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా సీబీఐ విచారణ ద్వారా దీని వెనకాల ఉన్న నిజాలు నిగ్గుతేల్చాలి. సీబీఐ విచారణ కాకపోతే రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా జరిపించాలి. వెంకటేశ్వరస్వామి వారి బొక్కసానికే కన్నం వేసే ఇంటి దొంగలను ఖచ్చితంగా శిక్షించాలి. టీటీడీ ఈవోనే ఈ రోజు మనం వేలెత్తి చూపించే స్థితిలో ఇరుక్కున్నాడు. ఆయనది ఒంటెద్దు పోకడ. ఆ బంగారు ఎవరిదో నీకు తెలిసో తెలియదో.. ఆ బంగారం టీటీడీది అవునో కాదో.. టీటీడీదని చెబుతూ నువ్వు కాగితాలు ఇచ్చి పంపావు. ఆ కాగితాలు ముందు ఎందుకు చేరలేదు? పోలీసు పహారా లేకుండా ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ బంగారం ఎక్కడ ఉంది? కనీసం ఈవో వెళ్లి చూసి వచ్చాడా? తక్షణం ఈవోను సస్పెండ్ చేసి, విధుల నుంచి తప్పించి విచారణ చేయాలి. అసలు మోకాలు కాదు, అరికాలులోనైనా ఈవోకు బుర్ర ఉందా అని అడుగుతున్నాను. వీళ్లను అరెస్టు చేయాలి. టీటీడీలో ఉండే అధికారులు, రాజకీయ నాయకులు తమాషా పడుతున్నారు.
వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా..
ఒళ్లు మండిపోతోంది. వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా నేను. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. మరలా హిందూ సమాజం రోడ్లపైకి వస్తోంది. తమాషాలు చేస్తున్నారేమో. తిరుపతిలో కూర్చునేది. పెత్తనం చేసేది.. వందల, వేల కోట్లు సంపాదించుకునేది. ఏం తమాషానా? అందుకే చెబుతున్నా.. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం, ఏపీ ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి. ఓం నమో వెంకటేశాయా..