ఖర్చు తప్ప ఆధ్యాత్మిక భావన ఏదీ?
పుష్కరాల ఏర్పాట్లపై కమలానంద భారతి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు గుమ్మరించినా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను నింపలేకపోయిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. పుష్కరాల ఏర్పాట్లంటూ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆలయాలను కూల్చడం ప్రభావం చూపుతోందని, మున్ముందు ఇదే ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా కమలానంద భారతి, బీజేపీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ బుచ్చిరాజు తదితరులతో కలసి మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించినట్టు పీఠం బుధవారం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు పడిన ఇక్కట్లను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలా మంది ఈసారి ఘాట్లకు రావడానికి వెనుకాడుతున్నారని కమలానంద పేర్కొన్నారు.