ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
వేతన మార్పులు
పర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.
ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.
ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.
ఆర్థిక పనితీరు
కంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!
నిధుల సమీకరణ
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్‌మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment