భలే చాన్సులే.. | Swaha in the name of the road sector to prepare cc ..! | Sakshi
Sakshi News home page

భలే చాన్సులే..

Published Mon, Mar 7 2016 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

భలే చాన్సులే..

భలే చాన్సులే..

సీసీ రోడ్ల పేరిట స్వాహాకు  రంగం సిద్ధం..!
ఏప్రిల్ 20లోగా పనులు పూర్తి
 చేయాలంటూ సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్న అధికారులు
రూ.కోట్లు పక్కదారిపట్టే  అవకాశం
ఏటా మామూలే  అంటున్న  ఇంజినీరింగ్ అధికారులు
 

వ్యయంలో వైఫల్యంతో ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఏటా రూ. కోట్లు మురిగిపోతుంటాయి. కానీ ఈసారి ఆర్థిక సంఘం నిధులను జోడించి చేపట్టిన సీసీరోడ్ల ద్వారా ఇవి మురిగి పోకుండా చేపట్టిన ప్రయోగం టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కాసులు కురిపిస్తోంది. రూ. కోట్ల ప్రజాధనం దర్జాగా జేబుల్లో వేసుకునేందుకు మార్గం సుగమమైంది.
 
విశాఖపట్నం: కేంద్రం 14వ ఆర్థికసంఘం నిధులు ఈ ఏడాది నేరుగా పంచాయతీలకు కేటాయించింది. వీటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.69.27 కోట్లతో 2291 పనులు మంజూరయ్యాయి. వీటిలో  ఇప్పటి వరకు 800 పనులు మాత్రమే పూర్తి కాగా.. ఇంకా 200 పనులు ప్రారంభమే కాలేదు. మరో పక్క ఇంకా ఉపాధిహామీ పథకంలో మెటిరియల్ కాంపొనెంట్ నిధులు రూ.256 కోట్లు మిగిలిపోయాయి. అవి మురిగిపోకుండా, పది శాతం నిధులిస్తే 90 శాతం ఉపాధిహామీ నిధులిస్తామని.. వీటితో గ్రామాల్లో మరిన్ని సీసీ రోడ్లు నిర్మించుకోవచ్చంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆశతో కొన్ని పంచాయతీలు రూ.6.93 కోట్లు ఇచ్చేందుకు ముందుకురాగా వాటికి 62.35కోట్లు ఉపాధి నిధులు(90శాతం) జత చేసి సీసీరోడ్లకు శాంక్షన్ ఇచ్చారు.

ఇంకా రూ.249.38కోట్లున్నాయి.
జిల్లాలో ఇంకా రూ.249.38కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ నిధులున్నాయి. పంచాయతీల్లో అందుబాటులో ఉన్న రూ.27.71కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తే గ్రామాల్లో మట్టిరోడ్డు అంటూ లేకుండా చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పదేపదే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన పనులేకాదు. 10ః90 నిష్పత్తి లో ఆర్థికసంఘం-ఉపాధి నిధులతో చేపట్టే సీసీ రోడ్లన్నీ ఏప్రిల్ 20 లోగా పూర్తి చేస్తేనే బిల్లులు మంజూరవుతాయంటూ స్పష్టం చేస్తున్నారు.
 
నిబంధనలు ఇలా...
ఎం-30 స్టాండర్డ్(ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక) ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో, వాటర్ ప్యూరింగ్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25వేల చొప్పున కోత పెట్టొచ్చు..పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంచనాలు.. సాంకేతిక,పరిపాలనా ఆమోదాలకు కనీసం పదిరోజులు పడుతుంది. గైడ్‌లైన్స్ ప్రకారం రూ.లక్షకు 35మీటర్లకు మించి సీసీ రోడ్డు నిర్మించడానికి వీల్లేదు. 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తే రోజుకు 40 మీటర్లకు మించి రహదారి నిర్మాణం జరిగే అవకాశం లేదు. ఈ లెక్కన కిలోమీటర్ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తవ్వాలంటే సుమారు 20 రోజుల పడుతుంది, కనీసం 28 రోజుల పాటువాటరింగ్ చేయాలి. ఆ తర్వాత సాంకేతిక బృందం ఆమోద ముద్ర వేస్తే కానీ బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉండదు.
 
40 రోజుల్లో ఎలా సాధ్యం
వాస్తవాలు ఇలా ఉంటే..ఇన్ని వందల కిలోమీటర్ల రహదారులు కేవలం 40 రోజుల్లో పూర్తి చేయడం..బిల్లులు డ్రా చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని..అంచనాలు రూపొందించి మొక్కు బడిగా పనులు చేపట్టడం, ఆ తర్వాత పూర్తికాకుండానే మమా అనిపించి స్వాహా చేయాలన్న ఎత్తుగడ కనిపిస్తోందన్న వాదన ఉంది. పర్సంటేజీల కోసం కక్కుర్తిపడే అధికారులు వీరికి అడ్డగోలుగా అండదండలందజేస్తున్నారు. ఇదే విషయమై పీఆర్ అధికారులను వద్ద ప్రస్తావిస్తే ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఇలా హడావుడిగా పనులు చేయడం..బిల్లులు డ్రా చేయడం మామూలేనని తేల్చిపారేశారు.
 
చేసిన పనులకే బిల్లులు లేవు
మా గ్రామంలో 2లక్షల పంచాయతీ నిధులిస్తే రూ.2లక్షల ఉపాధి నిధుల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్నారు. పనులు పూర్తయి రెండునెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు 10 శాతం నిధులిస్తే 90 శాతం నిధులు ఇస్తామంటున్నారు. పైగా ఏప్రిల్ 20లోగా పూర్తి చేయాలని మెలిక పెట్టారు. ఇది సాధ్యం కాదు. ఈలోగా పూర్తి చేయకపోతే మా పరిస్థితి ఏమిటి.
 -మడిసి వెంకటలక్ష్మి, సర్పంచ్, జి.అగ్రహారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement