అన్నీ అడ్డంకులే!
నత్తనడకన సిమెంటు రోడ్ల నిర్మాణం
లేబర్ కాంపొనెంట్ కోసం ఎదురుచూపు
రూ.103 కోట్ల పనులకు 26 కోట్ల పనులే పూర్తి
మార్చిలోపు పనులు పూర్తి కావడం గగనమే
తిరుపతి: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 50 శాతం ఉపాధి నిధులు, మిగిలిన 50 శాతం 14వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చినాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు పనులు చేసేందుకు 60 శాతం మెటీరియల్ కాంపొనెంట్,40 శాతం లేబర్ కాంపొనెంట్ తప్పనిసరి. దీంతో కొన్నిచోట్ల పనులు పూర్తయినా బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. కూలీలు పనిచేసిన విలువ తక్కువగా ఉండడం ఇబ్బందిగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. లేబర్ కాంపొనెంట్ నిధులు పెరిగే వరకు వేచి చూస్తామన్న ధోరణిలో ఉన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షమందికి పైగా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరి సంఖ్య ఏప్రిల్, మే నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పుడు లేబర్ కాంపొనెంట్ నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఎలాగోలా పనులను సాగదీసే ధోరణిలో కాంట్రాక్టర్లు ఉన్నారు.
మదనపల్లెలో మరీ డల్
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చిత్తూరు డివిజన్ పరిధిలో రూ 32.43 కోట్ల విలువైన 1118 పనులకు కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో కేవలం రూ.11.66 కోట్ల విలువైన 670 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. తిరుపతి డివిజన్ పరిధిలో 1460 పనులు మంజూరయ్యాయి. వీటి అంచనా విలువ రూ.46.19 కోట్లు. ఇందులో రూ10.07 కోట్ల విలువైన 848 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మదనపల్లె డివిజన్‌లో రూ.24.73 కోట్ల విలువైన పనులను మంజూరు చేశారు. ఇందులో అతితక్కువగా కేవలం రూ.5.59 కోట్ల విలువైన పనులు మాత్రమే చేపట్టారు. ఈ పనులన్నీ మందకొడిగా జరగడానికి కొన్ని ప్రాంతాల్లో ఇసుక కూడా ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు.