మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఎన్నో ఉద్యమాలు, మరెన్నో బలిదానాల ఫలితం.. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. దీంతో 50 ఏళ్ల ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష ఫలించింది. వెనకబాటుతనం నుంచి బయటపడాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరోమార్గం లేదని ఎన్నోఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయవంతమైంది.
10 జిల్లాలతో కూడిన తెలంగాణకు గురువారం కేంద్రకేబినేట్ ఆమోదం తెలపడంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ప్రజలు, నాయకులు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణరాష్ట్ర సాధన కోసం సహాయ నిరాకరణ ఉద్యమం 16రోజులు, సకలజనుల సమ్మె 42 రోజుల పాటు చేసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా మిలియన్‌మార్చ్, సాగర హారం, సమరదీక్ష ఇలా ఎన్నో రకాల దీక్షలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కొందరు.. అసలు రాష్ట్రం వస్తుందోలేదోననే దిగులుతో మనోవేదనకు గురై మరెందరో బలవన్మరణాలకు పాల్పడ్డారు. 13 ఏళ్లుగా టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం ముందుండి పోరాటాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలన్నీ వెల్లడించడంతో కేంద్రప్రభుత్వం కూడా ఉద్యమతీవ్రతను గుర్తించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం జులై 30న నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఇదిలాఉండగా సీడబ్ల్యూసీలో నిర్ణయం వెలువడిన వెంటనే సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో ప్రక్రియను కొంత ఆలస్యం చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం చేయాలని మళ్లీ ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు, టీజేఏసీ నాయకులు వివిధ రకాలుగా కేంద్రంపై ఒత్తిడిపెంచడంతో గురువారం నిర్వహించిన కేంద్ర కేబినెట్‌లో 10జిల్లాలతో కూడిన తెలంగాణకు ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధికారికంగా ప్రకటించడంతో జిల్లాలో పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. విభజన వల్ల తలెత్తే ఆదాయం, అప్పులు, జలవనరులు ఇతర సమస్యలను పరిష్కారం కోసం మంత్రుల బృందాన్ని నియమించడానికి కేంద్ర చర్యలు తీసుకుంటుందని షిండే ప్రకటించారు. వీటికి అనుగుణంగా నవంబర్‌లో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో సీమాంధ్ర ప్రాంత నాయకుల్లో నెలకొన్న అనుమానాలను పరిష్కారం దొరుకుతుందని ఆందోళనలు విరమించాలని పలువురు నాయకులు విజ్ఞప్తిచేశారు.
నేతల సంబురాలు
ఇదిలాఉండగా టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి ఇంటివద్ద పెద్దఎత్తున కార్యకర్తలు టపాసులు కాల్చిసంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ప్రభాకరచారి, టీపీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి తదితరులు తెలంగాణ చౌరస్తాకు చేరుకొని ఒకరినొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
వీరితో పాటు పాలమూరు యూనివర్శిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి విజయం సాధించామంటూ ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడంతో ఎన్నో ఏళ్ల కల ఫలించిందని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఫలించిన పోరాటం
Published Fri, Oct 4 2013 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement