ప్లీజ్‌ వెళ్లొద్దు..!  | Congress Requesting Party Leaders To Not Join In TRS | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ వెళ్లొద్దు..! 

Published Wed, Jun 6 2018 11:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Requesting Party Leaders To Not Join In TRS - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండడంతో పట్టు పెంచుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఓ పార్టీ పట్టును నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. మరొక పార్టీ మరింత బలోపేతం చేసుకునేందుకు సమయాత్తం అవుతున్నారు. ఇటీవల తరుచు వార్తల్లోకి ఎక్కుతున్న నాగం జనార్దన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిల వ్యవహారం కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తోంది. నియోజకవర్గంలో ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాలని దామోదర్‌రెడ్డి రాష్ట్ర పీసీసీ చీఫ్‌తో పాటు ఏఐసీసీకి గతంలోనే అల్టిమేటం ఇచ్చారు. అందుకు సరైన స్పందన రాకపోవడంతో దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌లు ప్రత్యేకంగా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో టీఆర్‌ఎస్‌లో దామోదర్‌రెడ్డి చేరేందుకు ముహూ ర్తం ఖరారైనట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండ గా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీని వీడకుండా ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఆయనతో జరుపుతున్న మంతనాల్లో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో నాగంతో కలిసి తాను పనిచేయలేనని ఆయన తెగేసి చెబుతున్నారు. మరోవైపు నాగంను కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపిస్తామని పీసీసీ నేతలు దామోదర్‌రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరి మాటా తాను నమ్మనని ఎమ్మెల్సీ అన్నట్లు తెలుస్తోంది. మరోపక్క రాహుల్‌గాంధీతో అపాయింట్‌మెంట్‌ తీసుకుని దామోదర్‌రెడ్డిని కలిపించేందుకు రాష్ట్ర పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క, సోనియాగాంధీ అంతరంగికుడు కొప్పుల రాజులు ప్రయత్నిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్షన్‌కు తెరపడడం లేదు.  

టీఆర్‌ఎస్‌ వైపు ‘ఎడ్మ’ అడుగులు.. 
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం అనంతరం స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఆయన అన్ని రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.  ఏ పార్టీలోనూ ప్రస్తుతం కొనసాగనప్పటికీ వివిధ ప్రజా ప్రయోజిత కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తు న్నారు. కల్వకుర్తికి తాగునీరు సాధించే విషయంలో పలుమార్లు మంత్రి హరీశ్‌రావును కలుస్తూ వచ్చిన ఆయన ఇక్కడి ప్రజల ఆకాంక్షకు కృతజ్ఞతగా టీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నట్లు తన సన్నిహితులతో అభిప్రాయ పడుతున్నారు. నేడో రేపో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం ఇటు నాగర్‌కర్నూల్, అటు రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తరఫున పలువురు నేతలు టికెట్‌ ఆశిస్తూ వస్తున్నారు. ఎడ్మ కిష్టారెడ్డి కూడా ఆ స్థాయి వ్యక్తి కావడంతో కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ రాజకీయాలు మున్ముందు రసవత్తరంగా మారనున్నాయి.  

అలంపూర్‌ నుంచి అబ్రహం 
అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం సైతం అధికార పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్‌ శాసనసభ్యుడు సంపత్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించారు. ఈ సమయంలో ఆయనపై పోటీ చేసేందుకు సమర్థవంతమైన నాయకుడి కోసం పార్టీ అన్వేషణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అబ్రహం టీఆర్‌ఎస్‌లోకి వస్తే పార్టీకి లాభం ఉంటుందని అధికార పార్టీ నేతలు ఆయ న రాక కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఒకే వే దికపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నేతలంద రూ సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కం డువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.  

టీఆర్‌ఎస్‌లో నూతనోత్తేజం 
కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న వర్గ పోరును అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. కొల్లాపూర్‌ కాంగ్రెస్‌లో ఇటీవల సీనియర్‌ నాయకుడు జగదీశ్వర్‌రావు చేరారు. దీంతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హర్షవర్ధన్‌రెడ్డికి సమాచారం లేకుండానే జగదీశ్వర్‌రావు వ్యవహరిస్తుండడం హర్షవర్ధన్‌కు నచ్చడం లేదు. ఇటీవల కాంగ్రెస్‌కి చెందిన కొందరు నేతలు జగదీశ్వర్‌రావు వెంట ఉండడంతో సహించని హర్షవర్ధన్‌ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒకరికి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు. దీంతో వారి మధ్య ఇంకా దూరం పెరుగుతోంది. వరుస విజయాలతో కొల్లాపూర్‌లో దూసుకుపోతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలోని విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్‌కి చెందిన పలువురిని టీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 

సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై హర్షవర్ధన్‌రెడ్డి కోర్టులో దావా వేయడంతో ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కొల్లాపూర్‌లో రోజురోజుకు పుంజుకుంటుండంతో పాటు జూపల్లిపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో హర్షవర్ధన్‌రెడ్డి అప్రమత్తంగా ఉంటుండడంతో ఒక దశలో జూపల్లికి గుబులు పుట్టించింది. ప్రస్తుత విభేదాలు తనకు కలిసి వస్తాయని మంత్రి అంచనా వేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని తమ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. ఆయనతో పాటు దామోదర్‌రెడ్డి అనుచరులంతా వచ్చేలా పథకం రచిస్తున్నారు. ఉమ్మడి శత్రువు అయిన నాగం జనార్దన్‌రెడ్డికి చెక్‌ పెట్టేందుకు ఇటు మర్రి జనార్దన్‌రెడ్డి, అటు దామోదర్‌రెడ్డి పనిచేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మొత్తం మీద అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచ్ఛన్న యుద్ధం రోజురోజుకు ఆసక్తిని కలిగిస్తోంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement