కాచి..వడబోసి కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయాలనుకున్న ఆ పార్టీ అధిష్టానానికి జిల్లాలో పరిస్థితిని ఇక్కడి నేతలు చక్కగా వివరించారు. కలవని దారుల్లో తాము ప్రయాణిస్తున్నామని చెప్పకనే చెప్పారు. ఒకొరిపై ఒకరు బురద జల్లుకుంటూ పరిశీలకుడు ఎం. మంజు ముందే వీరంగం చేశారు. మొత్తానికి వర్గాలు బలంగా ఉన్నాయని ఢంకా బజాయించారు. కాంగ్రెస్ కోటకున్న బీటలెన్నో చూపారు.
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల అన్వేషణ కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ వరుస తప్పింది. సీనియారిటీ పేరిట పాత తరం నేతలకు టికెట్లిచ్చి ఓడిపోవడం కంటే ప్ర జల్లో పలుకుబడి ఉన్నవారిని ఎంపిక చేసి ఎలాగైనా సరే ఈ సారి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో భావి ప్రధాని అభ్యర్థిగా భావి స్తున్న రాహుల్ గాంధీ స్వయంగా తన దూతను పంపారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన నేతలను వడపోయాలన్న ఆయ న సంకల్పానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు స్వచ్చంధంగా వచ్చి ఏ ఐసీసీ పరిశీలకుడితో వాస్తవాలు చెప్తారనుకున్న అధిష్టానం అంచనాలకు వర్గపోరాటాలు గండికొట్టాయి. టికెట్ల కోసం తీవ్రస్థాయిలో పైరవీలు చేసుకుంటున్న ఆశావహులు, వారి మద్దతుదారులు, అనుకూల వర్గాలకు మందు...విందుతో పాటు అన్ని విలాసాలు కల్పించి వాహనాల్లో చేరవేసి కాంగ్రెస్ మార్కు రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు.
క్యాంపులు పెట్టడం తప్పా అన్ని ప్రలోభాలు చోటు చేసుకున్నాయి. శని, ఆదివారాల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటు, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసి గెలిచే అభ్యర్థుల అభిప్రాయ సేకరణకు కర్ణాటక ఎమ్మెల్యే ఎం.మంజు పరిశీలకునిగా వచ్చారు. ఈ ప్రక్రియలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్న నాయకులు తమదైన శైలిని ప్రదర్శించా రు. దీంతో కాంగ్రెస్‌లో చాపకింద నీరులా ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి.
మంత్రుల అండదండలు...
జిల్లా మంత్రి డీకే అరుణ, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అండదండలతో వర్గ పోరాటం కొనసాగింది. ఎంపీ అభ్యర్థిపై తమ అభిప్రాయాలు చెపుతామని మంత్రి అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి,మాజీ ఎంపీ మల్లురవి తదితరులు శనివారం ఉదయమే రాహుల్‌దూత వద్దకు వచ్చారు. ఈ సాకుతో మత మద్దతుదారులకు టికెట్ రావడానికి ఇబ్బందులు ఎదురవకుండా అనుకూలంగా అభిప్రాయాలు చెప్పే విధంగా క్యాడర్‌ను సమాయత్తం చేశారు. ఎంపీ అభ్యర్థిగా విఠల్‌రావుతో పాటు మంత్రి అ రుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ బుర్రివెంకట్‌రాంరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. అత్యధికంగా విఠల్‌రావు నే ఎంపీ అభ్యర్థిగా అన్ని వర్గాలు ప్రకటించడంతో ఆయనే మొదటి స్థానంలో ఉన్నారు.
అసెంబ్లీ స్థానాల్లో స్థానిక నినాదం...
కొన్ని అసెంబ్లీ స్థానాల్లో స్థానికులకే టికెట్లు ఇవ్వాలన్న వాదన బలంగా సాగింది. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి , జడ్చర్లలో మల్లు రవి స్థానికులు కారని, వారికి టికెట్లు ఇవ్వొద్దని పోటీ ఆశావహులు పరిశీలకునికి వివరించారు. కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి జైపాల్‌రెడ్డి వర్గీయుడిగా ముద్రపడినందున, ఆయనకు వ్యతిరేకంగా సలీమ్, కృష్ణను మంత్రి అరుణ ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దేవరకద్రలో డోకూరు పవన్‌కుమార్ రెడ్డి, జడ్చర్లలో మల్లురవికి ఆమె అండదండలు ఉన్నాయని అంటున్నారు. కాగా బీసీలకు జిల్లాలో కనీసం 6 సీట్లు, మైనార్టీలకు 2 సీట్లు ఇవ్వాలని, లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ ఓబీసీ రాష్ట్ర చైర్మన్, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఏఐసీసీ పరిశీలకుడికి తేల్చిచెప్పారు.
చీలిన దుర్గం..!
Published Mon, Feb 3 2014 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement