
బదిలీ మాటున ‘బద్‌లా’
సాక్షి, కాకినాడ : పగ్గాలు చేపట్టి రెండునెలలు కూడా కాకుండానే ‘బద్‌లా’ (కక్ష సాధింపు) చర్యలు మొదలెట్టారు తెలుగుదేశం నేతలు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదన్న అనుమానంతో పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం అధికార యంత్రాంగం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇందుకు సంబంధించి మరో వారం రోజుల్లో మార్గదర్శకాలు జారీ కానుండగా.. నెలాఖరులో ఈ తంతు పూర్తి చేయాలని టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
అధికారులు, ఉద్యోగుల పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బందులు తలెత్తవన్న భావనతో ఏటా సాధారణ బదిలీలు మే లేదా జూన్‌లో జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏవైనా అత్యవసర పరిస్థితులు, వివాదాలు, ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుంటే తప్ప బదిలీలుండవు. అయితే టీడీపీ సర్కారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండునెలల తర్వాత ఆగస్టులో బదిలీలకు సన్నద్ధమవడం వివాదాస్పదమవుతోంది. సాధారణంగా కనీసం రెండేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారిని మాత్రమే బదిలీలకు పరిగణనలోకి తీసుకావాలి. కానీ చరిత్రలో తొలిసారిగా జీర్ బేస్డ్ సర్వీస్ (పని చేసిన కాలంతో పనిలేకుండా) ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రిన్సిపల్ కార్యదర్శుల వరకు బదిలీ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. అంతేకాక ఒక శాఖలో బదిలీ అయ్యే వారు 20 శాతానికి మించకూడదన్న నిబంధనను కూడా పక్కన పెడుతోంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున తమను బదిలీ చేస్తే విద్యాప్రమాణాలు కుంటుపడతాయని ఉపాధ్యాయులు చెపుతున్నందున వారిని బదిలీల నుంచి మినహాయించింది.
కనీసం 10 వేల మందికి స్థానచలనం!
మిగిలిన అన్ని శాఖల్లో పై నుంచి కింద స్థాయి వరకు అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదని భావిస్తున్న వారి జాబితాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధుల శాఖలవారీగా ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 56 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా, వీరిలో సుమారు పాతికవేల మంది ఉపాధ్యాయులు. వారిని మినహాయిస్తే మిగిలిన 31 వేల మందిలో కనీసం 10 వేల నుంచి 15 వేల మంది వరకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, స్త్రీ,శిశుసంక్షేమం, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, ఉపాధిహామీ, మత్స్య శాఖల సిబ్బందిపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి.
తొలుత జిల్లా, డివిజన్ స్థాయిలలో, తర్వాత మండలస్థాయిలో పనిచేసే తహశీల్దార్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఎఫ్‌డీఓ, ఎస్సైలు, చివరగా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు.. ఇలా అన్నిస్థాయిల్లోనూ బదిలీల కుదుపు తప్పదనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టర్, జేసీల బదిలీ తప్పదని ప్రచారం సాగుతోంది. వారి బదిలీ తర్వాత వరుసగా బదిలీ లుంటాయని చెబుతున్నారు. విద్యాప్రమాణాలు కుంటుపడతాయని కోరగానే ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించిన ప్రభుత్వం తమ పిల్లలను వేలకు వేలు ఫీజులు కట్టి పాఠశాలల్లో చేర్పించి రెండున్నర నెలలు కావస్తుండగా ఇప్పుడు బదిలీ వేటు వేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇ ప్పటికిప్పుడు తాము వేరే ప్రాంతాలకు వెళితే పిల్లలకు అడ్మిషన్లే కా దు.. అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఎవరు అధికారంలోకొచ్చినా వారి ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేస్తాం తప్ప ఏ పార్టీకీ కొమ్ము కాయమని చెబుతున్నా రు. అకాలపు బదిలీలు కక్షసాధింపే తప్ప మరొకటి కాదని అంటున్నా రు. ఇకనైనా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అభ్యర్థిస్తున్నారు.