పారాణింకా ఆరనే లేదు..తోరణాల కళ వాడనే లేదు..పెళ్లి పందిరి తీయనే లేదు.. పెళ్లి కూతురుగా కళకళలాడిన ఓ నవ వధువుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. పున్నమి రువ్విన వెన్నెల నవ్వకు అమావాస్య చీకట్లు కమ్మేశాయి. కన్నవారికి గుండెకోత మిగిల్చిన ఈ విషాద సంఘటన చెన్నూరులో ‘శని’వారం చోటు చేసుకుంది.
చెన్నూరు : చెన్నూరులోని బ్రాహ్మణవీధికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు పూసపాటి ఉమాదేవి కుమార్తె వినీల(23) వివాహం ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసే జయకృష్ణతో మే 24న అంగరంగ వైభవంగా జరిగింది. దాంపత్య జీవితంపైన, కాబోయే భర్తపై ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన వినీల మూడుముళ్లు పడగానే ఎంతో ఇష్టంగా అత్తారింట మహాలక్ష్మిలా అడుగుపెట్టింది. అప్పటి నుంచి వారి దాంపత్య జీవనం అన్యోన్నంగా సాగిపోతోంది.
పుట్టింటికని వచ్చి...
ఆ నవ వధువుకు ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ మూడ్రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. శనివారం అమ్మ పాఠశాలకు వెళ్లగా.. అమ్మమ్మ, అన్న బయట ఉండగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీల బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తరువాత ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడింది. సకాలంలో ఎవరూ గమనించకపోవడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఎంతసేపటికీ వినీల బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఎంత పిలిచినా వినీల నుంచి సమాధానం లేదు.
దీంతో ఆందోళనతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా అక్కడి దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న వినీలను కిందకు దించి చూడగా అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయి ఉండడాన్ని గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అమ్మ, అన్న, బంధువులు ఇంటికి చేరుకున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వినీలను చూసేందుకు వచ్చిన స్నేహితులు, స్థానికులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
రంగంలోకి దిగిన తహశీల్దార్, ఎస్‌ఐ
వినీల ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే చెన్నూరు తహశీల్దార్ శాంతమ్మ, ఎస్‌ఐ హనుమంతు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లి ఉమాదేవి, బంధువులు, ఆమె భర్త జయకృష్ణ, స్థానికులను విచారణ జరిపారు. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదని వారు చెప్పారు. అయితే ఆమెకు అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేదని, వైద్యం కూడా చేయించుకునేదని తెలిపారు. దీనిపై ఎస్‌ఐ స్పందిస్తూ.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
పారాణి ఆరకనే
Published Sun, Jun 29 2014 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement