అంతంత మాత్రమే! | Manyara D drugs | Sakshi
Sakshi News home page

అంతంత మాత్రమే!

Published Sat, Feb 22 2014 12:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM

అంతంత మాత్రమే! - Sakshi

అంతంత మాత్రమే!

  •      మన్యానికి అందని మందులు
  •      ఆశ కార్యకర్తల వద్ద ఔషధాల కొరత
  •      ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే స్థితి
  •      గిరిజనులకు తప్పని ఇక్కట్లు
  •      పీహెచ్‌సీల వైద్యుల నిర్లక్ష్యం పర్యవసానం
  •  గోరంత దీపం కొండంత వెలుగన్నది ఆశ కార్యకర్తలకు అక్షరాలా సరిపోతుంది. మన్యంలో అనారోగ్యం చీకట్లు కమ్ముకున్న వేళ వారి చేయూత కారణంగా గిరిజనులకు ఎంతో ఊరట లభిస్తుంది. వ్యాధులు వేధిస్తూ ఉంటే, ఆశ కార్యకర్తల ద్వారా ప్రాథమిక వైద్యం సాధ్యమవుతుంది. కానీ ఆపాటి చికిత్సకూ వారి దగ్గర మందులు నిండుకుంటే? మారుమూల గ్రామాల్లో గిరిజనులకు ఆపాటి సాయం కూడా అందే దారేది? మన్యంలోని పీహెచ్‌సీల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. సకాలంలో మందులు సరఫరా కాక గిరిజనుల ఆరోగ్యం ఒడిదుడుకుల్లో పడేట్టు కనిపిస్తోంది.
     
    పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో గిరిజనులకు వైద్య సాయం అందేదే స్వల్పం.. అనారోగ్యం వేధిస్తున్నా చాలామందికి సాయం శూన్యం. కొద్దిపాటి చేయూత కూడా అందని పరిస్థితి ఏర్పడింది.  ఏజెన్సీలోని గ్రామాలకు మందుల కొరత ఎదురవుతోంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేవు. ఏటా నాలుగు దఫాలుగా రూ. 3 కోట్ల బడ్జెట్‌తో  మందులు విశాఖ సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి అందాల్సి ఉంది. అయితే జనవరి మొదటి వారానికే చివరి విడత మందులు ఆరోగ్య కేంద్రాలకు చేరాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలాఖరుకు కూడా ఏజెన్సీకి  వైద్య ఆరోగ్యశాఖ నుంచి మందుల ఇండెంట్‌లు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరలేదు.

    దాంతో మూడో దఫాలో అక్టోబర్‌లో పంపిణీ చేసిన మందులనే ఆస్పత్రులు, గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు వినియోగిస్తున్నా రు. పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలకు వెళ్లే వైద్య బృందాల వద్దకు కూడా అరకొరగానే మందులు ఉంటున్నాయి.
     
    బాధ్యతారాహిత్యం
     
    ఏజెన్సీలోని 3,200 మంది ఆశ కార్యకర్తల వద్ద జ్వరం, విరేచనాల మందులు, యాంటిబయోటిక్ మాత్రలు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. ప్రతీ నెల ఆశ కార్యకర్తలకు ఆరోగ్య కేంద్రాల్లో 50కి మించి జ్వరం నివారణ బిళ్లలు పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామాల్లో జనాభాకు తగ్గట్టుగా ఆశ కార్యకర్తల వద్ద మందులు ఉండడం లేదు.

    డిసెంబర్ రెండో వారానికే ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల వైద్యులు చివరి దఫా మందుల ఇండెంట్‌ను వైద్య ఆరోగ్యశాఖకు, ఐటీడీఏ డ్రగ్‌స్టోర్‌లకు అందజేయాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి ముగుస్తున్నా చాలా చోట్ల నుంచి ఇండెంట్ అందలేదు. కిలగాడ, ముంచంగిపుట్టు, సుంకరమెట్ట, అనంతగిరి, భీమవరం, యు.చీడిపాలెం, ధారకొండ, డౌనూరు, కె.డి.పేట, కంఠవరం, లుంగపర్తి తదితర పీహెచ్‌సీల నుంచి మందుల ఇండెంట్‌ను వైద్యులు పంపలేదు. సమయానికి మందులు రప్పించుకోవాల్సిన బాధ్యతను కూడా కొంతమంది వైద్యులు విస్మరిస్తున్నారు.

    అన్ని ఆస్పత్రుల నుంచి ఇండెంట్‌లు వస్తేనే పాడేరు డ్రగ్‌స్టోర్ నుంచి అధికారులు ఈ మందుల వివరాలను ఆన్‌లైన్ చేసి విశాఖపట్నంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు పంపుతారు. అక్కడినుంచి మందులను పాడేరుకు తరలిస్తారు. అయితే ఇండెంట్ లేక పాడేరు డ్రగ్‌స్టోర్ అధికారులు కూడా సమయానికి మందులు తెప్పించలేకపోయారు. మందులు పుష్కలంగా అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటిస్తున్నా  బడ్జెట్ ప్రకారం సమయానికి మందులను కూడా పొందలేని పరిస్థితిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement