
ఉనికి కోసమే మావోయిస్టుల ఘాతుకం
వ్యాపారి హత్యపై స్పందించిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్
అర్ధరాత్రి అడవుల్లో పర్యటన
సీలేరు: మావోయిస్టులు ఉనికి కోసమే వ్యాపారి గుండూరావును హతమార్చారని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. ఆయన సీలేరులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి పర్యటించారు. జీకేవీధి నుంచి సీలేరు వరకు ఉన్న అడవుల్లో అర్ధరాత్రి ప్రయాణించి రాత్రి ఒంటిగంట సమయంలో సీలేరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెల్లవార్లూ స్టేషన్‌లోన ఉన్న
ఆయన మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. పావురాయి దళ సభ్యుడిని పట్టించాడనే అనుమానంతో జీకేవీధి మండలానికి చెందిన అపరాల వ్యాపారి గుండూరావును చంపాలని అయిదేళ్లుగా మావోయిస్టుల టార్గెట్ చేశారని చెప్పారు. ఆ వ్యాపారి ఏడాదిపాటు పోలీసు భద్రతలోనే ఉన్నాడని, రెండు రోజుల క్రితం ఎక్కడ ఉన్నావ ని ఫోన్ చేస్తే నర్సీపట్నంలో ఉన్నానని చెప్పాడన్నారు. గుండూరావు మళ్లీ అపరాల వ్యాపారం చేసేందుకు మావోయిస్టులతో సంబంధాలు పెంచుకుందామనే ఉద్దేశంతో అతని భార్య, తమ్ముడిని రాయబారానికి పంపాడని, తమ నుంచి ఎటువంటి హాని ఉండదని చెప్పి మావోయిస్టులు నమ్మించి హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఔట్‌పోస్టులతో గిరిజనులకు మేలు
ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువ శాతం ఔట్‌పోస్టులు కావాలని కోరుకుంటున్నారని, అవి పెట్టడం వల్ల గిరిజనులకు మేలు జరుగుతుందే తప్ప నష్టం లేదని చెప్పారు. మావోయిస్టులు గిరిజనుల చేత చెట్లు నరికించడం, ఇళ్లు తగలబెట్టించడం, గిరిజనుల హత్య వంటి చట్ట వ్యతిరేక పనులు చేయించడంతో తాము గిరిజనులపై కేసులు నమోదు చేస్తున్నామని, ఔట్ పోస్టులు ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గిరిజనులకు చేరువయ్యేందుకే రాళ్లగెడ్డలో ఔట్ పోస్టును ఏర్పాటు చేశామని, కేంద్రం నుంచి అదనపు బలగాలు రావాల్సి ఉన్నందున ప్రస్తుతం తమ వద్ద ఉన్న సివిల్ పోలీసు బలగాలతోనే అక్కడ భద్రతను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులల్లో పోలీస్‌స్టేషన్లపై మావోయిస్టులు దాడులు చేసే అవకాశం లేదని తెలిపారు.
ఏజెన్సీలో ఆధునిక పోలీస్‌స్టేషన్లు
ఏజెన్సీలో రూ.2 కోట్లతో కొత్త ఆధునిక పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని, ఇందులో సీలేరు కూడా ఉందని ఎస్పీ చెప్పారు. ఒక్కో ఔట్‌పోస్టుకు 120 మంది పోలీసులు, ఒక సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని, వీటి వల్ల గిరిజనుల భద్రతతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటవుతాయన్నారు. కోరుకొండ పంచాయితీల్లో రూ.8 కోట్లతో రహదారులు, మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 30 వేలకు పైగా కేసులు నమోదు చేశామని, ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేశామని వివరించారు. ఆయన వెంట సీఐ వెంకటరావు, సీలేరు ఎస్‌ఐ మురళీధర్ ఉన్నారు.