గొల్లూరులో మావోయిస్టుల స్థావరం
- పోలీసుల రికార్డుకు ఎక్కని ప్రాంతం
- మావోయిస్టుల స్థావరాన్ని ఛేదిస్తాం
- 3 జిల్లాల ఉమ్మడి కూంబింగ్‌కు చర్యలు
- విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్
పాడేరు: ఒడిశాలోని కోరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులోని పొట్టంగి బ్లాక్‌లో గొల్లూరు మారుమూల ప్రాంతాన్ని స్ధావరంగా చేసుకొని మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారని విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమావేశం అనంతరం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. గొల్లూరు ప్రాంతం మావోయిస్టుల అడ్డాగా మారిందన్న విషయం ఇంత వరకు ఒడిశా, విజయనగరం, విశాఖ జిల్లాల పోలీసు యంత్రాంగం గుర్తించ లేదన్నారు.
గతంలో కూడా ఈ ప్రాంతం పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదని, ఇక్కడ మావోయిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న వైనం పోలీసు యంత్రాంగాన్నే ఆశ్చర్యపరుస్తుందన్నారు. 3 జిల్లాల సరిహద్దులోని లోయప్రాంతం కావడంతో ఇంత వరకు పోలీసులకు అనుమానం రాలేదన్నారు. అరకులోయ మండల కేంద్రానికి 20 కి.మీ దూరంలో ఉన్న గొల్లూరులో ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయనే పక్కా సమాచారం ఉందన్నారు.
మావోయిస్టుల స్థావరాన్ని చేధించేందుకు కొరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. తాను,విజయనగరం, కోరాపుట్టు ఎస్పీలంతా ఉమ్మడి వ్యూహంతో కూంబింగ్ చర్యలను చేపడతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొట్టంగి బ్లాక్ పరిధిలో మావోయిస్టు డొంబ్రి ఎన్‌కౌంటర్‌కు ప్రతికారంగా మావోయిస్టులు ఇద్దరు కొండదొర కులస్తులను హతమార్చారని, గత నెల సొంకి సమీపంలో గిరిజనేతరుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారని తెలిపారు.
ఒడిశాలోని కోరాపుట్టు,విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం వద్ద కూడా ఈ మారుమూల లోయ ప్రాంతం సమాచారం లేదన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏఓబీలోని మావోయిస్టు కేడర్ అంతా అక్కడే మకాం ఏర్పరచుకున్నట్లు తెలుస్తుందన్నారు. మావోయిస్టుల చర్యలను అణచి వేసి ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు.
విశాఖ ఏజెన్సీలోని ఐఏపీ పథకం కింద చేపట్టిన రూ.3 కోట్ల రోడ్డు పనుల పురోగతిపై ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమీక్షించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించామని ఏజెన్సీలో ఇంజనీరింగ్ పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు పోలీసుశాఖ కూడా కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.