సరిహద్దులో కలకలం | maoists wrote letter in border | Sakshi
Sakshi News home page

సరిహద్దులో కలకలం

Published Wed, Feb 26 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

సరిహద్దులో  కలకలం

సరిహద్దులో కలకలం

 పట్టపగలు పోస్టర్లు వేసి వెళ్లిన మావోయిస్టులు
 భద్రాచలానికి కూతవేటు దూరంలోనే..
 మరో రెండు గ్రామాల్లో కూడా....
 తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో 27 డిమాండ్లతో                    
   తెల్లకాగితంపై చేతిరాతలు
 కొరియర్లా? కొత్తగా పార్టీలో చేరిన వారా?
 నెలరోజుల క్రితమే ఒకేరోజు 100 పోస్టర్లు
 మిలటరీ ప్లాటూన్‌కు భూంకాల్‌మిలీషియా సభ్యులు
 కొత్త రిక్రూట్‌మెంట్ చేయాలని ఒడిశా సరిహద్దు సమావేశంలో నిర్ణయం!
 
 
  సాక్షి ప్రతినిధి, ఖమ్మం
 భద్రాచలం పట్టణానికి కూతవేటు దూరంలో మంగళవారం వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్ పెద్ద కలకలమే రేపింది. గతానికి భిన్నంగా పట్టపగలే మావోయిస్టులు పోస్టర్ వేయడం అటు పోలీసు వర్గాల్లో, ఇటు ప్రజానీకంలో చర్చనీయాంశమయింది. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో పార్టీ ఉత్తర తెలంగాణ కమిటీ పేరిట 27 డిమాండ్లతో భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఎటపాక గ్రామంలో మావోయిస్టులు చెట్టుకు పోస్టర్ వేశారు. ఆ తర్వాత అదే మండలంలోని లక్ష్మీపురంలో శబరి ఏరియా కమిటీ పేరుతో మరో పోస్టర్ పడింది. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లిలో కూడా అలాంటి పోస్టరే కనిపించింది. దీంతో ఒక్కసారిగా సరిహద్దు ఉలిక్కిపడింది.  ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు ఏదో కార్యక్రమాలు చేస్తుండడం....ఉన్నట్టుండి ఒకేరోజు మూడు చోట్ల మావోయిస్టులు పట్టపగలే పోస్టర్లు వేయడం చూస్తే సరిహద్దులో మళ్లీ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో అనే చర్చ నడుస్తోంది.
 
 రోడ్డుపాయింట్‌లే లక్ష్యం
 గత వ్యూహాలకు భిన్నంగా ముందుకెళుతున్న మావోయిస్టులు పోలీసులతో కయ్యానికి కాలుదువ్వే సంకేతాలు పంపుతున్నారు. గతంలో పోస్టర్లు వేసినప్పుడు మావోయిస్టులు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కేవలం రాత్రివేళల్లో మాత్రమే... అది కూడా ఊరిచివర, కల్వర్టుల దగ్గర వేసి వెళ్లేవారు. పోస్టర్లు వేసేందుకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకునేవారు. ఇదే తరహాలో నెలరోజుల క్రితం దుమ్ముగూడెం మండలంలో ఒకే రోజు 100 నుంచి 150 పోస్టర్ల వరకు వెలిశాయి. రాత్రి 10 గంటల సమయంలో మండలంలోని అంజిబాక, దుమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, కాటాయిగూడెం, వీరభద్రారం గ్రామాల్లో మావోయిస్టు పార్టీ పేరిట పోస్టర్లు వేశారు. ఆదివాసీలపై బైండోవర్ కేసులు ఎత్తివేయాలని, అమాయక గిరిజన మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు. అంతకు ముందు చర్ల మండలంలోని తాలిపేరు బ్రిడ్జి వద్ద కూడా 10 పోస్టర్లు వేసి వెళ్లారు.
 
 పెదినలబెల్లి నుంచి గౌరారం వరకు వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆ పోస్టర్లలో రాశారు. కానీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఏకంగా పట్టపగలే భద్రాచలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. మారుమూల పాయింట్లను వదిలి రోడ్డు పాయింట్లను లక్ష్యంగా చేసుకుని  పోస్టర్లు వేయడం వారి కార్యకలాపాలు సరిహద్దుల్లో ముమ్మరమవుతున్నాయనేందుకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 కొత్తగా రిక్రూట్ అయిన వారి పనేనా?
 ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాలు ఉధృతమవుతున్నాయనే భావన కొంతకాలం నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవలే మావోలు దుమ్ముగూడెం మండలంలోని పెదార్లగూడెంలో ఎయిర్‌టెల్ టవర్‌ను పేల్చివేశారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరు, ముగ్గురిని చంపివేశారు. కోడిపందేలకు వెళ్లిన ఓ వ్యక్తిని హతమార్చారు. మిలిటరీ ప్లాటూన్ కమాండర్ సుఖ్‌దేవ్ నేతృత్వంలోని బృందం ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం ఉంది. కానీ, పట్టపగలు పోస్టర్లు ఎవరు వేసి ఉంటారా అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే, రెండు నెలల క్రితం ఒరిస్సా సరిహద్దు అటవీప్రాంతంలో మావోయిస్టుల కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మిలటరీ ప్లాటూన్, పార్టీ ఏరియా కార్యదర్శులతో సమావేశమైందని సమాచారం. ఈ సమావేశం సందర్భంగా మిలటరీ ప్లాటూన్‌లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని, భూంకాల్ మిలీషియా సభ్యులను కొందరిని ప్లాటూన్‌కు పంపాలని అగ్రనాయకులు ఆదేశించారని, ఈ మేరకు కొందరు ప్లాటూన్‌లో రిక్రూట్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిలీషియాలో పనిచేసేందుకు మరికొందరు సభ్యులు అవసరం అయినందున పార్టీ ఏరియా కార్యదర్శులు అనువైన గ్రామాలను ఎంచుకుని అక్కడి యువతను పార్టీలో రిక్రూట్‌చేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏజెన్సీతో పాటు ఆవలి ప్రాంతంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోందని సమాచారం. దీంతోపాటు కొరియర్ వ్యవస్థ బలోపేతం అయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
 
  కొరియర్ల సహకారంతోనే మావోయిస్టులు పట్టపగలే పోస్టర్లు వేశారని, కొత్తగా పార్టీలో రిక్రూట్ అయిన వారే ఈ చర్యకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. కానీ పోలీసు వర్గాలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నాయి. మావోయిస్టులకు పట్టపగలు అంత లోపలికి వచ్చేంత అనుకూల పరిస్థితి లేదని, వారికి కొరియర్లుగా పనిచేస్తున్న వారే పోస్టర్లు కూడా వేసి ఉంటారని అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement