ఏవోబీలో మొక్కదశలో ఉన్న గంజాయి తోటలు
అరకులోయ: ఏవోబీ... ఇది ఇప్పుడు మావోయిస్టులకే కాకుండా గంజాయి సాగు, స్మగర్లకు షెల్ట్టర్‌జోన్‌గా మారింది.ఏజెన్సీలోని పలు మండలాల్లో ఎక్సైజ్, పోలీసు అధికారలు దాడులు చేస్తుండడంతో గంజాయి వ్యాపారులు ఇప్పుడు ఏవోబీపై దృష్టిసారించారు. విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలపై ప్రభుత్వం దృష్టిసారించడంతో బడా వ్యాపారులంతా మకాం మార్చారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో ఒడిశా, విశాఖ జిల్లాకు చెందిన పోలీసు,ఎక్సైజ్‌శాఖలు ఏవోబీలో గంజాయి తోటల జోలికి పోవడం లేదు.దీంతో గంజాయి స్మగర్లర్లు ఏవోబీలో భారీగా పెట్టుబడులు పెట్టి గంజాయి సాగు చేయిస్తున్నారు.
జీకే వీధి,చింతపల్లి,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి.దీంతో ఒడిశా,ఆంధ్రా భూములనే తేడా లేకుండా నీటి వనరులు అందుబాటులో ఉన్నచోట గంజాయిని సాగుచేస్తున్నారు. ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో గంజాయి విస్తృంగా సాగవుతోంది.
ఆధునిక పద్ధతుల్లో
ఏవోబీలో గిరిజనులంతా అధునిక పద్ధతుల్లో గంజాయిని సాగుచేస్తున్నారు.గంజాయి సాగుకు ఎరువులు,క్రిమిసంహరక మందుల వినియోగం కూడా గతంలో కన్న బాగా పెరిగింది.శీలావతి రకం గంజాయికి విలువ అధికంగా ఉండడంతో వ్యాపారులంతా దీనినే ప్రోత్సహిస్తున్నారు. సుమారు 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.బలిమెల, సీలేరు రిజర్వాయర్లను ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతాలలో గంజాయి సాగు అధికంగా ఉంది.మల్కన్‌గిరి కటాఫ్ ఏరియాలో ఎక్కడ చూసిన గంజాయి వనాలే అధికంగా దర్శనమిస్తున్నాయి.
వ్యతిరేకత వస్తుందని..
ఏవోబీలో గంజాయి సాగు అధికంగా ఉందనే సమాచారం ఇరురాష్ట్రాల పోలీసు,ఎక్సైజ్ అధికార యంత్రాంగం వద్ద ఉన్నప్పటికీ దాడులు చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. మావో యిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడికి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఏవోబీలో గిరిజనుల్లో ఇప్పుడిప్పుడే పోలీసుల పట్ల సానుకూలత ఏర్పడుతోంది. ఈ సమయంలో దాడులు చేస్తే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో కూంబింగ్ చర్యలు చేపడుతున్న సమయంలో గంజాయి తోటలు కంట పడుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు దాడులు చేయడం లేదు.కేవలం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంతోనే కూంబింగ్‌లు జరుగుతున్నాయి.గడచిన 10 ఏళ్లలో ఏవోబీలో గంజాయి తోటలను నాశనం చేసిన దాఖలాలు లేవు.ఒడిశాలోని యంత్రాంగం కూడా గంజాయి తోటలను చూసిచూడనట్టుగానే వ్యవహరిస్తోంది.గత రెండేళ్ల నుంచి విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.గత ఏడాది 288 గ్రామా ల పరిధిలో సాగైన 3200 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ,ఈ గంజాయి దాడులు మాత్రం మావోయిస్టు ప్రభావిత గ్రామాలు,ఏవోబీలో మాత్రం జరగలేదు.ఏవోబీలో ఒక్క ఎకరం గంజాయితోటను కూడా పోలీసు,ఎక్సైజ్‌శాఖల ఉమ్మడి దాడుల్లో ధ్వంసం చేయలేకపోయాయి. అక్కడ ప్రస్తుతం గంజాయి తోటలలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.ఏవోబీలో గంజాయి తోటల సాగు ఉచ్చు నుంచి గిరిజనులను బయటకు తీసుకొచ్చే చర్యలు చేపట్టి,ఏవోబీలో మకాం వేసిన గంజాయి వ్యాపారులను కూడా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment