అక్రమంగా పశువధ!
విజయనగరం మున్సిపాలిటీ/క్రైం : అనధికారిక పశు కబేళాకు జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు పశువులను వధించడంతో పాటు వాటి మాంసం విక్రయిస్తున్నారు. కేవలం అధికారుల నుంచి మాంసం విక్రయాలకు అనుమతులు తీసుకుని వాటి ఆధారంగా పశు కబేళాలు నిర్వహిస్తున్నారు. చట్టాలను, సంప్రదాయాలను తుంగలోకి తొక్కి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఈ విషయం మున్సి పల్, రెవెన్యూ అధికారులకు తెలిసినా.. ఫిర్యాదులు అందినా..మామ్మూళ్ల మత్తులో పడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం పట్టణంలోని కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్న పశువధశాలపై వన్ టౌన్ పోలీసులు చేసిన దాడిలో పట్టుబడిన వ్యక్తి మున్సిపల్ కో ఆప్సన్ సభ్యుడి బినామీగా తెలుస్తోంది.
ముందు రోజే హెచ్చరించినా...
కలెక్టరేట్‌కు కూతవేటు సమీపంలో కొన్ని నెలలుగా అనధికారికంగా పశువధ కబేళాలతో పాటు మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. శనివారం ఆ ప్రాంతానికి వెళ్లిన ఆర్‌డీఓ వెంకటరావు, తహశీల్ధార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్. సోమన్నారాయణ, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కె. రామారావు తనిఖీ చేశారు. అనధికారికంగా గోవధ శాలలను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి, వెళ్లిపోయారు. అయినా అనధికార గోవధ శాలల యజ మానులు ఆదివారం ఉదయం కూడా దుకాణం తెరిచి తమ పని కానిస్తున్నట్టు వన్‌టౌన్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మాంసాన్ని విక్రయిస్తున్న ఎండీ అహ్మదుల్లా దుకాణంపై పోలీసులు దాడులు చేసి అందులో మాంసాన్ని స్వాధీనం చేసుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు.
అనధికార గోవధ శాలను మున్సిపల్ కో ఆప్సన్ మెంబర్ బినామీ పేరుతో నిర్వహిస్తున్నట్టు స్థానికు లు ఆరోపిస్తున్నారు. దీనికి జిల్లాకు చెందిన టీడీపీ నాయకుల మద్దతు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆది వారం పట్టుబడిన నిర్వాహకునిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు నటన నటించా రన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటలకు సంఘటన స్థలానికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెళ్లగా 10 గంటల వరకు ఉన్నతాధికారి వస్తారంటూ సమాధానం చెప్పారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఆ ఛాయల్లో కనిపించలేదు. ఒక శానటరీ ఇన్‌స్పెక్టర్ మాత్రమే వచ్చి నలుగురితో నారాయణ అన్న చందంగా ఘటనా స్థలంలో వ్యవహరించారు. ప్రతి నెలా వారికి లక్షలాది రూపాయల ముడు పులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విషయంపై మున్సిపల్ కమిషనర్ సోమన్నా రాయణను ‘సాక్షి’ వివరణ అడిగేందుకు ప్రయత్నిం చగా.. ఆయన సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.
15 ఏళ్ల క్రితమే అధికారిక పశువధ కబేళా ఎత్తివేత
పట్టణంలోని గెంజిపేట సమీపంలో 15 ఏళ్ల క్రితం అధికారిక పశువధ కబేళా ఉండేది. కాలక్రమంలో అప్పటి మున్సిపల్ కమిషనర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాటిని పూర్తిగా మూయించేశారు. అనంతరం ద్వారపూడి చెరువులో అనధికారికంగా పశువధ కబేళా నిర్వహించగా రెవె న్యూ అధికారులు దాడులు చేసి దాన్ని కూడా మూయించేశారు. అప్పటి నుంచి ఎటువంటి అధికారిక కబేళా లేకున్నా పట్టణంలో మాత్రం యథేచ్ఛగా నివాస గృహాల మ ధ్యే పశువధ చేస్తున్నారు.
అధికారులపై ఒత్తిళ్లు
దేవదాయ ధర్మాధాక శాఖ చట్ట ప్రకారం 300 మీటర్ల దూరంలో మద్యం దుకాణం, మాంసం దుకాణం ఉండకూడదు, అయితే 50 మీటర్ల దూరంలో ఈ వ్యవహారం జరుగుతున్నా.. పట్టించుకునే వారు లేరు. నిర్వాహకులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండ ఉండడంతో అధికారులు ఏమీ చే యలేని పరిస్థితి. ఎవరైన పట్టుబడినా వారి పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.
మున్సిపల్ అధికారుల అండతోనే...
మున్సిపల్ అధికారుల అండతోనే ఈ దందా కొనసాగుతోంది. మున్సిపల్ అధికారుల వద్ద నుంచి మాంసం విక్రయాల కోసం తీసుకునే అనుమతి పత్రాన్ని చూపించి మిగిలిన అధికారులను మోసం చేస్తున్నారు. పశుసంవర్థశాఖ అధికారులు ఇందుకు ఎటువంటి అనుమతులివ్వలేదు. ఇదంతా మున్సి పల్ అధికారుల అండదండలతోనే సాగుతోంది.
- లోగిశ రామకృష్ణ , ఏపీ గోశాలల, గో పరిరక్షకుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు